
వరద నీటితో పూర్తిగా నిండిన ఇడుక్కి జలాశయం
తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 29 మంది మృతి చెందగా, సుమారు 54వేల మంది నిర్వాసితులు అయ్యారు. వీరిలో 53,501 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు తెలిపారు. మరోవైపు వర్షాల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఏడు ఉత్తర జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అదనంగా మరో 5 ఆర్మీ బృందాలను రంగంలోకి దింపారు. పెరియార్ నది నీటి మట్టం అతివేగంగా పెరుగుతోంది.
ఇడుక్కి రిజర్వాయర్ నుంచి మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో ఇడుక్కితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆసియాలో అతిపెద్ద ఆర్చ్ డ్యాం ‘ఇడుక్కి రిజర్వాయర్’ నిండడంతో మరో 3 గేట్లను ఎత్తారు. వరదలపై మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరదల నేపథ్యంలో ఈ నెల 12 వరకు ఆయన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.