ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే! | Water levels in Kerala start to fall as rescue efforts continue | Sakshi
Sakshi News home page

హృదయవిదారకం..!

Published Mon, Aug 20 2018 2:34 AM | Last Updated on Mon, Aug 20 2018 2:01 PM

Water levels in Kerala start to fall as rescue efforts continue - Sakshi

తిరువనంతపురం: కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద తీవ్రత ఇంకా తగ్గలేదు. రాష్ట్రంలో ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనబడుతున్నాయి. ఓవైపు ఊళ్లకు ఊళ్లు వరదలో మునిగిపోగా.. వరదనీటిలో మునిగి నాలుగైదురోజులుగా సాయం కోసం ఎదురుచూస్తున్నవారు ఇంకా ఉన్నారు. వీరిని సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు రక్షించే పనిలో ఉన్నాయి. మరోవైపు, పునరావాస కేంద్రాల్లో పరిస్థితి దైన్యంగా ఉంది. సరైన వసతుల్లేకపోవడంతోపాటు తమవారికి క్షేమసమాచారం అందించేందుకు ఏర్పాట్లు కూడా లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగురోజులపాటు కేరళకు వర్షం రాకపోవచ్చన్న వాతావరణ శాఖ సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ను వెనక్కు తీసుకున్నారు.

ఎవరి నోట విన్నా.. ‘మళ్లీ ఈ ప్రపంచాన్ని చూస్తామనుకోలేదు. ఇది పునర్జన్మ. నాలుగురోజులుగా పీకల్లోతు నీళ్లలో తిండి తిప్పల్లేకుండా ఉన్నాం. దేవుని దయతో బయటపడ్డాం’ అనే మాటలే వినబడుతున్నాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం. చావును కళ్లముందు చూసిన పరిస్థితులనుంచి బయటపడటంతో చాలా మంది ఇంకా షాక్‌లోనే ఉన్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, వైమానిక, నేవీ బృందాలు పలు ప్రభుత్వ సహాయక బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడం, పునరావాస కేంద్రాలకు తరలించడంలో బిజీగా ఉన్నాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 5,645 పునరావాస కేంద్రాల్లో 7.24 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మృతుల సంఖ్య 370కి చేరింది.

కొనసాగుతున్న సహాయక చర్యలు
నాలుగైదు రోజులుగా తినడానికి తిండిలేక.. నీరసించిపోయి మేడలపైనుంచి సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నవారిని హెలికాప్టర్లు, పడవల ద్వారా ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ, వైమానిక, ఆర్మీ బలగాలు కాపాడాయి. అలప్పుజ, త్రిసూర్, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాల్లో ఇంకా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. మొత్తం 370 మంది మృతుల్లో ఒక్క ఇడుక్కి జిల్లా నుంచే 43 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. మలప్పురం జిల్లాలో 28, త్రిసూర్‌లో 27 మంది మృతిచెందినట్లు వెల్లడించారు. ‘ఇది మాకు పునర్జన్మ. నాలుగురోజులుగా తిండి లేదు నీళ్లు లేవు. మెడ వరకు నీళ్లలోనే భయం భయంగానే నిలబడి ఉన్నాం. ఆర్మీ వాళ్లు కాపాడకపోతే పరిస్థితి వేరోలా ఉండేది’ అని పత్తనంతిట్టలోని ఓ పునరావాస కేంద్రంలో ఉన్న ఓ మహిళ  ఆ భయానక పరిస్థితులను గుర్తుచేసుకుంది.


త్రిసూర్‌ కకావికలం
ఎర్నాకులం జిల్లాలోని పరవూర్‌లో చర్చి కుప్పకూలడంతో అక్కడ తలదాచుకుంటున్న ఆరుగురు చనిపోయినట్లు తెలిసింది. ఒక్క త్రిసూర్‌ జిల్లాలోనే దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ‘త్రిసూర్‌ జిల్లాలోని కోలే మాగాణి ప్రాంతంలోని 42 గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. కరివన్నూర్‌ నది ఈ ప్రాంతాన్ని ముంచెత్తింది’ అని కేరళ వ్యవసాయ మంత్రి వీఎస్‌ సునీల్‌ కుమార్‌ వెల్లడించారు. సహాయక కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు కొచ్చిలోని నేవల్‌ ఎయిర్‌పోర్టును సోమవారం నుంచి తెరవనున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్‌గార్డ్స్‌ సిబ్బందితోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వేల సంఖ్యలో మత్స్యకారులు, స్థానికులు వీరికి సాయం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి చిన్నారులు, మహిళలు, వృద్ధులను ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలు కాపాడుతున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది.  

కుంటుంబాన్ని కాపాడి.. తాను బలై
త్రిసూర్‌ జిల్లాలోని ఓ గ్రామాన్ని రెండ్రోజులక్రితం వరదచుట్టుముట్టింది. ఊరు ఊరంతా మునిగిపోయింది. వరద ఉధృతి గంటగంటకూ పెరగుతుండటంతో ఓ 24 ఏళ్ల యువకుడు తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు నడుంబిగించాడు. ప్రాణాలకు తెగించి తల్లిని, తోబుట్టువులను ఒక్కొక్కరిగా సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. తండ్రిని కూడా రక్షించే ప్రయత్నంలో వరద ఉధృతి మరింత పెరిగింది. అతికష్టం మీద తండ్రిని దగ్గరున్న చెట్టును ఎక్కించాడు. కానీ వరదపోటు తీవ్రంగా ఉండటంతో తను కూడా చెట్టునెక్కే ప్రయత్నంలో పట్టుతప్పి నీటిలో కొట్టుకుపోయాడు. కళ్లముందే ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. శనివారం సాయంత్రం ఆ యువకుడి మృతదేహాన్ని ఊరికి సమీపంలోని చెట్ల మధ్య గుర్తించారు. కేరళ వరద బీభత్సంలో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలెన్నో ఉన్నాయి.

క్షేమంగానే ఉన్నాం కానీ..
సరైన సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర ప్రభుత్వ బృందాలు రావడంతో ప్రాణాలతో బయటపడగలిగామని బాధితులు చెప్పారు. అయితే పునరావాస కేంద్రాల్లో కనీస ఏర్పాట్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్నాకులం జిల్లా అలువాలోని యూసీ కాలేజీలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో పడుకునేందుకు చాపలు కూడా లేవని వాపోయారు. వయోసమస్యలతో బాధపడుతున్న చాలా మంది వృద్ధులు.. చాపల్లేకుండా చల్లని నేలపై పడుకోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేకపోవడంతో మొబైళ్లకు చార్జింగ్‌ లేక.. తమవాళ్లకు క్షేమసమాచారం తెలపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లినా ఇక్కడున్న ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు.  

చేరుకుంటున్న ‘సాయం’
పునరావాస కేంద్రాల్లో ఉన్న వారితోపాటు.. వరదల్లో చిక్కుకుపోయిన వారికి అందించాల్సిన ఆహారం, పాలు, ఔషధాలు ఒక్కొక్క రాష్ట్రం నుంచి కేరళ చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న మొదటి విడత సాయంలో భాగంగా 129 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 30 మెట్రిక్‌ టన్నుల పాలపొడి ఇప్పటికే కొచ్చికి రవాణా అయ్యాయి. మరోవైపు, తమిళనాడు మెడికల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌.. ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర మందులను పంపించింది. దీంతోపాటుగా పలు స్వచ్ఛంద సంస్థలు 150 ట్రక్కుల లోడ్‌లో బియ్యం ఇతర ధాన్యాలను పంపించాయి. మరోవైపు, పంజాబ్‌లోని పటియాలా, జలంధర్‌ల నుంచి బిస్కట్లు, రస్క్‌లు, తాగునీటి ప్యాకెట్లు విమానం ద్వారా కేరళకు చేరుకున్నాయి.

కర్ణాటకలోనూ వరదలు
కర్ణాటకలోని కొడగు జిల్లాలోనూ భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి.  వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం. ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు.. వరదల్లో చిక్కుకున్న 3500 మందిని కాపాడాయి. మక్కందూరులో ఓ మహిళ, ఆమె రెండు నెలల చిన్నారిని హెలికాప్టర్‌ సాయంతో కాపాడారు.

అంకెల్లో కేరళ వరద..
మృతులు (జూన్‌ నుంచి)    370
గత పది రోజుల్లో మృతులు 210
వరద నష్టం అంచనా రూ. 19,512 కోట్లు
పంట నష్టం     9,06,400 హెక్టార్లు
గేట్లు ఎత్తిన డ్యాములు 35
(మొత్తం డ్యాములు 39)
సహాయక శిబిరాలు 5,645
శిబిరాల్లో ఉన్నవారు 7,24,649
బలగాలు రక్షించిన వారు  33,000
కూలిన వంతెనలు, ధ్వంసమైన రోడ్లు 134

సహాయక చర్యల్లో..
ఆర్మీ  10 కాలమ్స్‌
నేవీ టీమ్స్‌ 82
కోస్ట్‌గార్డ్‌ టీమ్స్‌ 42  
ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 57
వాడిన హెలికాప్టర్లు 38
రవాణా విమానాలు 20

కేంద్రం పంపినవి
బియ్యం 129 మెట్రిక్‌ టన్నులు
పాలపొడి 30 మెట్రిక్‌ టన్నులు


వరద నీటిలో చిన్నారులను భుజాలపై మోసుకెళ్తున్న ఆర్మీ సిబ్బంది


అలప్పుజాలో మహిళను రక్షిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌


నిత్యావసర సరుకుల కోసం మహిళ వేడుకోలు

చెంగనూరులో తన వస్తువులతో సహా వరద నీటిని దాటుతున్న వ్యక్తి


అందుకోండి సాయం :చెంగనూరులో వరద బాధితులకు హెలికాప్టర్‌ నుంచి ఆహారపొట్లాలను జారవిడుస్తున్న వైమానిక దళ  సిబ్బంది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement