కొచ్చిలో వరద బాధితులను పడవలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సహాయక బృందాలు
తిరువనంతపురం: వరదబీభత్సానికి కేరళ చివురుటాకులా వణికిపోతోంది. వర్షాలు ఆగకపోవడంతో నదులు, కాలువలకు వరదపోటు తగ్గట్లేదు. పరిస్థితి రోజురోజుకూ హృదయవిదారకంగా మారుతోంది. శనివారం ఒక్కరోజే 22 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటిదాకా (ఆగస్టు 9న భారీ వర్షాలు మొదలైనప్పటినుంచి) మొత్తం మృతుల సంఖ్య 357కు చేరింది. 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. వరద పరిస్థితిపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం ఏరియల్ సర్వే జరిపిన అనంతరం కేరళకు తక్షణ సాయంగా రూ.500కోట్ల సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తుండటంతో ఎర్నాకులం, త్రిసూర్, ఇడుక్కి, పత్తనంతిట్ట, చెంగనూర్ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
తిరువనంతపురం, కొల్లాం, కాసార్‌గోడ్ జిల్లాల్లో వరద ఉధృతి తగ్గడంతో సహాయకకార్యక్రమాలను ముమ్మరం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కేరళలో మరో 24 గంటలపాటు భారీవర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలువా, చలకుడి, చెంగనూర్, అలప్పుజ, పత్తనంతిట్ట ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణనష్టం తీవ్రస్థాయిలో ఉంది. చాలాచోట్ల సహాయక కార్యక్రమాల్లో ఆలస్యంపై బాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కనీస వసతులు కల్పించడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ప్రజలు మండిపడుతున్నారు. చాలాచోట్ల రోడ్డు, రవాణా వ్యవస్థతోపాటు ప్రభుత్వ కార్యకాలాపాలు కూడా స్తంభించాయి.
మోదీ, విజయన్ ఏరియల్ సర్వే
వరద బాధితులు, కేరళ ప్రజలు అధైర్యపడవద్దని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి రూ. 500కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించడంతోపాటు ఆహారధాన్యాలు, ఔషధాలు, ఇతర సహాయాన్ని కేంద్రం నుంచే అందిస్తామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేల ఆర్థిక సాయం కేంద్రం తరపున అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు ఆయన తీవ్రంగా వరద బారిన పడిన అలువా, త్రిసూర్ ప్రాంతాల్లో ఎరియల్ సర్వే చేశారు. మోదీతోపాటు కేరళ గవర్నర్ పి. సదాశివం, సీఎం విజయన్, కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్, ఇతర అధికారులు కూడా హెలికాప్టర్‌లో ఉన్నారు.
ప్రాణ, ఆస్తినష్టం దురదృష్టకరమని మోదీ వ్యాఖ్యానించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ప్రధానంగా దృష్టిసారించాలని కేరళ ప్రభుత్వానికి, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలకు ప్రధాని సూచించారు. ఏరియల్ సర్వే అనంతరం కొచ్చిలో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం మొత్తం 357 మంది చనిపోయినట్లు నివేదిక ఇచ్చింది. 3.53 లక్షల మందిని 2వేలకు పైగా పునారావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొంది. కాగా, ఆగస్టు 12న కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రకటించిన రూ.100కోట్ల సాయానికి అదనంగా మరో రూ. 500 కోట్ల సాయాన్ని అందించనున్నట్లు సమీక్ష అనంతరం ప్రధాని మోదీ వెల్లడించారు.
పరిస్థితి గంభీరంగానే: విజయన్
సీఎం విజయన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. అయితే సకాలంలో స్పందించి తీసుకున్న చర్యల కారణంగా పరిస్థితి కొంతైనా నియంత్రణలో ఉంది. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మెల్లమెల్లగా కుదురుకుంటున్నాయి’ అని అన్నారు. ‘ఇప్పటివరకున్న లెక్కల ప్రకారం.. రాష్ట్రానికి రూ.19,512 కోట్ల నష్టం జరిగింది. కేంద్రం నుంచి రూ.2వేల కోట్ల సాయం కావాలని ప్రధానిని అడిగాం. రూ.500కోట్ల తక్షణసాయాన్ని మోదీ ప్రకటించారు’ అని విజయన్ ట్వీట్ చేశారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో కమ్యూనిస్టు ప్రభుత్వం విఫలమైందని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సహాయక కార్యక్రమాలు సరిగ్గా కొనసాగడం లేదని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల విమర్శించారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలమైనందున.. ఈ బాధ్యతను పూర్తిగా ఆర్మీకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
అతిపెద్ద ఆపరేషన్
రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్ 58 బృందాలు
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్‌ను కేరళ వరద ప్రభావ ప్రాంతాల్లో జరుపుతోంది. ఇప్పటివరకు దాదాపు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మొత్తం 55 బృందాలు రాష్ట్రంలోని వివిధ తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. మరో మూడు బృందాలు కూడా వీలైనంత త్వరగా వీరితో జతకలవనున్నాయని ఎన్డీఆర్‌ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
2006లో ఎన్డీఆర్‌ఎఫ్ స్థాపించిన తర్వాత ఒక రాష్ట్రంలో ఇన్ని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగటం ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు. ఒక్కో బృందంలో 35–40 మంది సభ్యులుంటారు. ఆగస్టు 8 నుంచి కొనసాగుతున్న సహాయ కార్యక్రమాల్లో మొత్తం 194 మందిని, 12 పశువులను ఈ బృందాలు రక్షించాయన్నారు. మొత్తం 10, 647 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. త్రిసూర్‌లో 15, పత్తనంతిట్టలో 13, అలప్పుజలో 11, ఎర్నాకులంలో 5, ఇడుక్కి 4, మల్లపురంలో 3, వయాంద్, కోజికోడ్‌లలో రెండు చొప్పున ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొచ్చిలోని కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడ ఈ కార్యక్రమాలను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.
ఠి 234.4 సెం.మీ వర్షం
కొచ్చి: వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో జూన్ 1 నుంచి ఈ నెల 18 వరకు 234.4 సె.మీ వర్షపాతం(సాధారణం కన్నా 42 శాతం అధికం) నమోదైనట్లు తిరువనంతపురంలోని వాతావారణ విభాగం(ఐఎండీ) విభాగం వెల్లడించింది. ఢిల్లీ వార్షిక సగటు వర్షపాతానికి ఇది ఐదు రెట్లు. ఇడుక్కి జిల్లాలో సాధారణం కన్నా 70 శాతం అధికంగా వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ ఈ ఏడాది లోటువర్షపాతం నమోదుకాకపోవడం గమనార్హం.
ప్లీజ్..మోదీకి చెప్పండి
కేరళలో వరదల దెబ్బకు సామాన్యులే కాదు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ స్థిమితంగా ఉండే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో లేదు. సాక్షాత్తు శాసనసభా సభ్యుడే తన రాష్ట్రంలోని దుస్థితిని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘వరదల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సరిపడ సంఖ్యలో పడవలు లేకపోవడంతో పేద మత్స్యకారుల పడవలను వినియోగించుకుంటున్నాం. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని హెలికాప్టర్లు పంపి మమ్మల్ని కాపాడాలని దయచేసి ప్రధాని మోదీకి చెప్పండి’ అని చెంగన్నూర్ ఎమ్మెల్యే సాజి చెరియాన్ ఓ టీవీ చానెల్‌లో అభ్యర్థించారు.
కేరళ పోరాటస్ఫూర్తికి సెల్యూట్: మోదీ
ఆహారధాన్యాలు, ఔషధాలు, ఇతర సహాయక వస్తువులను కేంద్రం తరపున అందజేస్తామని మోదీ భరోసా ఇచ్చారు. రోడ్డు రవాణా వ్యవస్థను త్వరగా పునర్వ్యవస్థీకరించాలన్నారు. సామాజిక భద్రత, ఫసల్ బీమా యోజనల్లో రిజిస్టర్ చేసుకున్న వారందరికీ న్యాయం జరిగేలా బీమా కంపెనీలు క్యాంపులు ఏర్పాటుచేయాలని కేంద్రం ఆదేశించింది. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్‌లో భాగంగా ఇళ్లు ఇవ్వడంలో ప్రాధాన్యత కల్పించనున్నారు. ఇతర ప్రభుత్వ పథకాల కింద కేరళకు సాయం ఎక్కువ అందిస్తామని సీఎం విజయన్‌కు మోదీ హామీనిచ్చారు. ‘ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉన్న కేరళ ప్రజల పోరాట స్ఫూర్తికి సెల్యూట్. భారతజాతి మొత్తం కేరళ వెంటే ఉంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. కేరళ త్వరగా సాధారణ స్థితికి రావాలని అభిలషిస్తున్నాను. కేరళకు కేంద్రం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుంది’ అని ప్రధాని ట్వీటర్‌లో పేర్కొన్నారు.
శనివారం కేరళలోని వరద ప్రాంతం అలువాలో విలపిస్తున్న మహిళ
సమీక్షాసమావేశంలో మోదీ, విజయన్
Comments
Please login to add a commentAdd a comment