
కొచ్చి: వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టదలచిన ఏరియల్ సర్వే రద్దయ్యింది. ప్రతికూల వాతావరణం కారణంగా మోదీ తన ఏరియల్ సర్వేను రద్దు చేసుకున్నారు. శనివారం ఉదయం కొచ్చి చేరుకున్న మోదీ.. ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. కేరళలోని భారీ ముంపునకు గురైన ఎర్నాకులం, ఆలపుజ్జా, పాతనమ్‌తిట్టా తదితర ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే షెడ్యూల్ ఖరారైంది. కాగా, వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా మోదీ ఏరియల్ పర్యటనను ప్రస్తుతానికి రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఉదయం తిరువంతపురం నుంచి కొచ్చికి వెళ్లిన మోదీ అక్కడి నుంచి ఏరియల్ సర్వేలో పాల్గొనాల్సి ఉండగా భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. వాతావరణం అనుకూలించకపోవడంతో సర్వే చేసేందుకు టేకాఫ్ అయిన హెలికాప్టర్ కొన్ని క్షణాల్లోనే కిందకు దిగిపోయింది.దాంతో కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో గవర్నర్ పి సదాశివంతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేరళలోని వరద బీభత్సానికి శుక్రవారం సాయంత్రం వరకూ 173 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల వ్యవధిలో 106 మంది ప్రాణాలు కోల్పోవడం వరదల తీవ్రతకు అద్దంపడుతోంది. నిరాశ్రయులైన సుమారు 3 లక్షల మంది 2 వేల సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా, పాతనమ్‌తిట్టా, ఆలప్పుజా, ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాల్లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది.