గర్భిణిని హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్తున్న దృశ్యం
పాలక్కడ్: దేవభూమిగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరుపడ్డ కేరళలో ఇప్పుడంతా జల విలయమే. మలయాళ సీమ మరుభూమిని తలపిస్తోంది. చిరుజల్లులతో దేశ, విదేశీ పర్యాటకులకు ఎల్లప్పుడూ ఆహ్లాదాన్ని పంచే ఆ రాష్ట్రం కుంభవృష్టితో చిగురుటాకులా వణికిపోతుంది. ఎప్పుడూ ఏ వైపు వరద ప్రవాహం ముంచుకొస్తుందోనని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సహాయక బృందాలు ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూస్తూ క్షణమొక యుగంగా గడుపుతున్నారు.
సాయం కోసం ఎదురుచూస్తున్న అక్కడి ప్రజల దుస్థితిని స్వయంగా చూడడమే కాకుండా.. వరద ఉగ్రరూపం నుంచి తృటిలో తప్పించుకున్న పీటీఐ జర్నలిస్టు మనోజ్ రామ్మోహన్ ప్రత్యక్ష అనుభవం ఇది. కేరళలోని వేలాది మంది ప్రజలు ఇలా ప్రాణాలు అరచేత పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తుంటే.. మరికొందరు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టాలని ప్రార్థిస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆ కష్టాలు ఆయన మాటల్లోనే..
క్షణాల్లో చుట్టుముట్టిన వరద
‘ఆగస్టు 9న మా తల్లిదండ్రులు నివసిస్తున్న పాలక్కడ్ పట్టణాన్ని ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది. విషయం తెలియగానే నేను ఢిల్లీ నుంచి ఇంటికి ఫోన్ చేశారు. కింది అంతస్తు నీటితో నిండిపోయిందని, పై అంతస్తులో తలదాచుకున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో సామాగ్రి, వంట సామాన్లు, బట్టలు కొట్టుకుపోయాయి. వంటగది మొత్తం చిందరవందరైంది. అన్ని గదుల్లో నీరే. అదృష్టవశాత్తూ మొదటి అంతస్తులో ఆహారపదార్థాలు ఉండడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికప్పుడు నేను ఢిల్లీ నుంచి బయల్దేరి ఎలాగోలా కొయంబత్తూరు చేరుకున్నా.
అక్కడి నుంచి గంటసేపు ప్రయాణించి ఎలాగోలా పాలక్కడ్ చేరుకున్నా. ఆ రోజు ఆకాశం కొద్దిగా తెరిపినిచ్చింది. అయితే మళ్లీ ఆకాశానికి చిల్లుపడ్డట్లు భారీ వర్షం. దీంతో సమీపంలోని కాలువ ఉప్పొంగి అనేక ఇళ్లను ముంచెత్తింది. దీంతో మాలో ఆందోళన మొదలైంది. తరువాతి రోజు కూడా నింగినేలా ఏకమైనట్లు ఒకటే వాన. మా ఇంటి ముందు భాగం మొత్తం మునిగిపోయింది. కేవలం రెండు కొబ్బరి చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కరెంటు లేదు.. ఫోన్లు మూగబోయాయి. కేవలం చుట్టుపక్కల జనం ఇచ్చే సమాచారంపైనే ఆధారపడ్డాం.
ఒకవైపు పాములు, విష పురుగుల భయం, మరోవైపు ఆగకుండా కురుస్తున్న వర్షం ఇక ఆలస్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదని గ్రహించి నా స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాను. మమ్మల్ని రక్షించేందుకు కొందరు యువకులు ముందుకొచ్చారు. వరద నీటిలో మా తల్లిదండ్రుల్ని ఆ యువకులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారిద్దరిని సురక్షిత ప్రాంతంలోని బంధువుల ఇంట్లో ఉంచి నేను ఢిల్లీ బయల్దేరాను. అయితే కొందరు స్థానికులు మాత్రం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ఇష్టపడలేదు. వరద తగ్గుముఖం పడుతుందని వారు ఎదురుచూస్తున్నారు. అయితే సమీపంలోని మలంపుజా డ్యాంలో నీటి ప్రవాహం పెరిగితే ముప్పు తప్పదని స్థానిక ప్రజలు ఆందోళనతో ఉన్నారు’
గర్భిణిని కాపాడారిలా..
ఇళ్ల పైకప్పులు, కొండ ప్రాంతాలు, ఇతర మారుమూల ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని ఎన్‌డీఆర్‌ఎఫ్, సైనిక బృందాలు కాపాడుతున్నాయి. పడవలు వెళ్లే వీలులేని ప్రాంతాల నుంచి ప్రజలను హెలికాప్లర్ల ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు తాడు కట్టి నేవీ హెలికాప్టర్ ద్వారా ఇంటి నుంచి బయటికి లాగిన దృశ్యాలు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. గాల్లో చాలాసేపు ప్రమాదకరంగా వేలాడటంతో ఆమె ఉమ్మనీటి సంచి పగిలింది. వెంటనే ఆ మహిళను నేవీ ఆసుపత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
ఆలువాలో కోళ్లను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్న యువకులు
Comments
Please login to add a commentAdd a comment