అ‘టెన్షన్’
* మావో అగ్రనేతల ఎన్‌కౌంటర్‌తో పోలీసుల అప్రమత్తం
* పల్నాడు, నల్లమల అటవీ ప్రాంతంలో రెడ్ అలర్ట్
* ప్రజాప్రతినిధులకు భద్రత కట్టుదిట్టం
సాక్షి, గుంటూరు: పల్నాడుతోపాటు నల్లమల అటవీ ప్రాంత పరిసరాల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఆంధ్ర– ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అనేకమంది మావోయిస్టు అగ్రనేతలు మరణించడం గమనార్హం. గుంటూరు రేంజ్ పరిధిలోని గుంటూరు రూరల్, ప్రకాశం జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉండడంతో ఇది మావోయిస్టు అగ్రనేతలకు గతంలో షెల్టర్ జోన్‌గా ఉండేది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గుంటూరు రేంజ్ పరిధిలోని నాలుగు పోలీసు జిల్లాల్లో ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వారి పర్యటనలపై ఎప్పటికప్పుడు తమకు ముందస్తు సమాచారం అందించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఏఎన్‌ఎస్ బృందాలు కూంబింగ్ ముమ్మరం చేసి మావోయిస్టుల స్థావరాల కోసం వెతుకులాట ప్రారంభించాయి. గతంలో ఉన్న ట్రాక్ రికార్డుల ఆధారంగా మావోయిస్టు సానుభూతిపరులపై నిఘా పెట్టారు.
భయాందోళనలో పల్నాడు ప్రజాప్రతినిధులు..
మావో అగ్రనేతల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పల్నాడులోని నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే గ్రామాలు, తండాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల్లోని బొల్లాపల్లి, ఈపూరు, కారంపూడి, దుర్గి, వెల్దుర్తి మండలాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించిఉండడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 2004కు ముందు మావోల తుపాకి మోతలు, పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఈ ప్రాంతం దద్దరిల్లిన విషయం అందరికీ తెలిసిందే. 2014లో గుంటూరు, ప్రకాశం జిల్లాల బోర్డర్‌లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేతలు జానా బాబూరావు, విమలక్క, పద్మక్కలు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సమయంలోనూ ఈ ప్రాంతంలో తీవ్ర అలజడి రేగింది. అప్పటినుంచి ప్రశాంతంగా ఉంటున్న నల్లమల సమీప ప్రాంతాల్లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్ నిద్రపట్టకుండా చేస్తోంది.
తుమృకోటలో ఉద్రిక్తత..
రెంటచింతల: పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన పృథ్వి అలియాస్ మున్నా మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) తనయుడే. ఆర్కేది రెంటచింతల మండలం తుమృకోట గ్రామం కావడంతో ఆప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పృథ్వి చాలా ఏళ్ల కిందట పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో ఏర్పాటుచేసిన చారుమజుందార్ స్మారక స్థూపం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల నిమిత్తం అడవి నుంచి బయటకు వచ్చిన సమయంలో గుత్తికొండ వద్ద ఏర్పాటు చేసిన భారీ మావోయిస్టుల సభలో సైతం ఆయన పాల్గొన్నట్లు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పల్నాడు ప్రాంతవాసులు భయపడుతున్నారు. కొందరు గ్రామం వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.