![YS Jagan Reacts on Palnadu Mirchi Farmers Road Incident](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/jagan1.jpg.webp?itok=bXBMKPVo)
నలుగురు మహిళా కూలీల దుర్మరణం
మరో 15 మందికి గాయాలు
పల్నాడు జిల్లా బొల్లవరం వద్ద ఘటన
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
ముప్పాళ్ల: ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు కూలీలు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంకి చెందిన 20 మంది మహిళా కూలీలు ట్రాక్టర్‌పై మిరపకాయలు కోసేందుకు వెళ్లారు. పనులు ముగించుకుని వారంతా ట్రాక్టర్‌పై తిరిగి ఇంటికి వస్తుండగా బొల్లవరం సమీపంలోని కాలువ కట్టపై ట్రాక్టర్ ఒక్కసారిగా తిరగబడింది. ట్రాక్టర్‌లో ఉన్న కూలీలంతా చెల్లాచెదురుగా కింద పడిపోయారు. ట్రాక్టర్ కింద నలిగిపోయిన కూలీలు మధిర గంగమ్మ (55), తేనేపల్లి పద్మ (48), చక్కెర మాధవి (30) అక్కడికక్కడే మృతి చెందారు.
మధిర సామ్రాజ్యం (65)కు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సత్తెనపల్లి వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది. మరో 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. మృతి చెందిన కూలీలంతా చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన వారే. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ముప్పాళ్ల పోలీసులు సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అత్యంత బాధాకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఆదివారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_59.png)
Comments
Please login to add a commentAdd a comment