కొచ్చి విమానాశ్రయం మూసివేత | Kochi Airport closed | Sakshi
Sakshi News home page

కొచ్చి విమానాశ్రయం మూసివేత

Published Thu, Aug 16 2018 3:29 AM | Last Updated on Thu, Aug 16 2018 4:41 AM

Kochi Airport closed - Sakshi

కొచ్చి విమానాశ్రయాన్ని ముంచెత్తిన వరద నీరు

తిరువనంతపురం/కొచ్చి: కేరళపై వరుణ ప్రతాపం కొనసాగుతూనే ఉంది. తాజాగా పెరియార్‌ నదిపై ఉన్న ఆనకట్ట గేట్లు తెరవడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోకి నీరు చేరింది. దీంతో శనివారం మధ్యాహ్నం వరకు ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, చిన్న విమానాలను కొచ్చిలోని నౌకాదళ విమానాశ్రయంలో దింపేందుకు అనుమతివ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. కొచ్చికి రావాల్సిన, కొచ్చి నుంచి బయలుదేరే విమానాల్లో సీట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకునేందుకు, ప్రయాణ తేదీల్లో మార్పులు చేసుకునేందుకు ఎలాంటి చార్జీలూ విధించబోమని విమానయాన సంస్థలు ప్రకటించాయి.

  రాష్ట్రంలో తాజా పరిస్థితిపై విజయన్‌ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌లతో చర్చించారు. అన్ని రకాలుగా సాయం చేస్తామని ప్రధాని హామీనిచ్చినట్లు విజయన్‌ చెప్పారు. విద్యుత్తు సరఫరా, సమాచార వ్యవస్థలు, తాగునీటి సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ మొత్తం 14 జిల్లాలకూ ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. బుధవారం ఒక్కరోజులోనే వివిధ జిల్లాల్లో కలిపి 25 మంది మరణించారు. వీరిలో 11 మంది మలప్పురం జిల్లాకు చెందిన వారే. కేరళలో వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం కారణంగా ఆగస్టు 8 నుంచి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 67కు పెరిగింది. నిరాశ్రయులుగా మారిన ఒకటిన్నర లక్షల మందిని శరణార్థి శిబిరాలకు తరలించారు.  

అన్ని నదుల్లోనూ వరదే
పెరియార్, చాలక్కిడిపుజ, పంపా సహా కేరళ వ్యాప్తంగా నదులన్నీ వరద నీటితో ఉప్పొంగుతున్నాయి. ముళ్లపెరియార్‌ డ్యాం సహా రాష్ట్రంలోని 35 ఆనకట్టల గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. మరోవైపు తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పాదనం దిట్ట, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూ ర్, కొజికోడ్‌ జిల్లాల్లో గంటలకు 60 కి.మీ. వేగంతో వీచే గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. బుధవారం ఉదయం మలప్పురం జిల్లాలో ఓ ఇంటిపై కొండ చరియలు విరిగిపడి ఆ ఇంట్లోని దంపతులు, వారి ఆరేళ్ల కుమారుడు మరణించారు. ఇడుక్కి జిల్లాలోనూ ఇళ్లపై కొండ చరియలు పడి ఇద్దరు మహిళలు మరణించారు. త్రిస్సూర్‌లో ఓ మత్స్యకారుడు విద్యుదాఘాతంతో చనిపోయాడు. మంగళవారం రాత్రి మున్నార్‌లో ఓ హోటల్‌పై కొండ చరియలు పడటంతో అక్కడ పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన కార్మికుడు మరణించారు. రాజధాని సహా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement