సాక్షి, న్యూఢిల్లీ : నగర మహిళల భద్రతకు ఉద్దేశించిన మొబైల్ అప్లికేషన్ ‘హిమ్మత్’ను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఆవిష్కరించారు. దేశంలో మొట్టమొదటిసారిగా నగరంలో అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో పాటు పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బస్సీ మాట్లాడుతూ హిమ్మత్ అప్లికేషన్ మహిళకు భద్రతను పెంపొదిస్తుందని చెప్పారు. ఈ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారు ఆపద సమయంలో మొబైల్ ఫోన్‌ను ఊపటం లేదా పవర్ బటన్‌ని రెండుసార్లు నొక్కటం ద్వారా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయవచ్చని తెలిపారు. ఈ అప్లికేషన్ నేరుగా పోలీసు కంట్రోల్ రూమ్‌తో అనుసంధానమై ఉంటుందని, పోలీసులకు వెంటనే సూచన అందుతుందని, ఆ తరువాత లొకేషన్ గుర్తిస్తారని, ప్రతి పది సెకన్లకు ఓసారి అప్‌డేట్ అందుతుందని ఆయన చెప్పారు. వీలైనంత ఎక్కువమంది మహిళలు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇది మహిళల భద్రత కోసం దేశంలో మొట్టమొదటి అధికారిక ఏకీకృత అప్లికేషన్ అని బస్సీ తెలిపారు.
మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఈ యాండ్రాయిడ్ అప్లికేషన్ హిమ్మత్‌ను రూపొందించారు.అత్యవసర పరిస్థితిలో వీలైనంత త్వరగా పోలీసులను అప్రమత్తులను చేయడానికి ఇది అనువుగా ఉంటుంది. నిర్థారిత సమయం పాటు పవర్ బటన్ నొక్కిన వెంటనే ఇది పోలీసు కంట్రోల్ రూముకు కాల్ చేయడానికి వీలు కల్పించడంతో పాటు 30 సెకన్ల ఆడియా, వీడియో రికార్డింగ్ కూడా చేస్తుంది. వినియోగదారులు తమ ఐదుగురు మిత్రులు లేదా బంధువుల నంబర్లను మొబైల్ ఫోన్‌లో ఫీడ్ చేయాల్సిందిగా ఈ యాప్ వినియోగదారులకు సూచిస్తుంది. ఆపద సమయంలో వినియోగదారులు ఒకవేళ ఎస్‌ఓఎస్ కాల్ చేసినప్పటికీ వెంటనేవారు ఫీడ్ చేసిన ఐదు నంబర్లకు కూడా తక్షణమే సందేశం అందుతుంది.ఈ విధంగా పోలీసులే కాకుండా, బంధుమిత్రులు కూడా ఆపదలో ఉన్న మహిళకు సహాయం అందించగలిగే వీలుంటుందని పోలీసులు చెప్పారు. ఈ యాప్‌తో జరిపే ఆడియో, వీడియో రికార్డింగ్ సాక్ష్యంగా పనికివస్తుందని వారు వివరించారు.
నగర మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’
Published Fri, Jan 2 2015 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM
Advertisement