‘అఫ్జల్’ సభకు సయీద్ మద్దతు
హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
♦ ఈ నిజాన్ని దేశం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి
♦ ఆధారాలు చూపాలని విపక్షాల డిమాండ్
♦ బీజేపీ నేతలతో ప్రధాని మోదీ భేటీ
అలహాబాద్/న్యూఢిల్లీ: జేఎన్‌యూ వ్యవహారంపై రాజకీయ రచ్చ మరింత ముదిరింది. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ వర్సిటీలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ మద్దతు ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ‘ఆ కార్యక్రమానికి సయీద్ మద్దతు ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఈ నిజాన్ని దేశం అర్థం చేసుకోవాలి’ అని ఆయన ఆదివారం అలహాబాద్‌లో విలేకరులతో చెప్పారు. జేఎన్‌యూలో నిరసనను రాజకీయ ప్రయోజనాల కోణంలో చూడొద్దని పార్టీలకు హితవు పలికారు. అనంతరం జాతి సమగ్రత, సార్వభౌమాధికారం విషయంలో దేశంలోని అన్ని పార్టీలు, ప్రజలు ఏకతాటిపై నడవాలని ట్విటర్‌లో కోరారు. జాతి వ్యతిరేక శక్తులపై పోరాడేందుకు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని, అలాగే అమాయకులను ఎట్టి పరిస్థితుల్లో వేధించబోమని స్పష్టంచేశారు.
మండిపడ్డ విపక్షాలు: రాజ్‌నాథ్ ప్రకటనపై విపక్షాలు మండిపడ్డాయి. ‘ఇది విద్యార్థులపై చాలా తీవ్ర ఆరోపణ. ఆయన తన ప్రకటనకు ఆధారాలను ప్రజల ముందు ఉంచాలి’ అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా డిమాండ్ చేశారు.‘సాక్షాత్తూ హోంమంత్రే ఈ తీవ్రమైన ఆరోపణ చేసినందున అందుకు తగ్గ సాక్ష్యాలను చూపాలి’ అని ఏచూరి అన్నారు. వివిధ సంస్థలు అందించిన సమాచారం మేరకే రాజ్‌నాథ్ ప్రకటన చేశారని హోం శాఖ తెలిపింది.
జాతి వ్యతిరేక ముద్ర వేయొద్దు: జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యను విడుదల చేయాలని ఉద్యమిస్తున్న విద్యార్థులకు అక్కడి అధ్యాపకులు మద్దతు పలికారు. వర్సిటీలో పోలీసు గస్తీ ఆపేయాలని కోరుతూ విద్యార్థులతో కలసి క్యాంపస్‌లో మానవహారం నిర్వహించారు. విద్యకు, ప్రజాస్వామిక సంస్కృతికి నిలయమైన తమ సంస్థకు జాతి వ్యతిరేకమని ముద్ర వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘వర్సిటీ కమిటీ దర్యాప్తు పూర్తవకముందే క్యాంపస్‌లో పోలీసు చర్యలకు వర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వడం తప్పు’ అని జేఎన్‌యూటీఏ అధ్యక్షుడు విక్రమాదిత్య ఆరోపించారు. అఫ్జల్ కార్యక్రమాన్ని నిర్వహించింది కన్హయ్య కాదని, నిర్వాహకులకు, ఏబీవీపీకి మధ్య వాగ్వాదం జరగడంతో జోక్యం మాత్రమే చేసుకున్నాడని అన్నారు. వర్సిటీ అంతర్గత యంత్రాంగం దెబ్బతిందని అధ్యాపకులు అన్నారు. కన్హయ్య విడుదల కోసం సోమవారం నుంచి బంద్ చేపట్టాలని విద్యార్థులు నిర్ణయించారు.వర్సిటీలో జరిగిన అఫ్జల్ గురు సంస్మరణ సమావేశంలో తాము భారత్ వ్యతిరేక నినాదాలు చేశామన్న ఆరోపణలను ఏబీవీపీ తోసిపుచ్చింది. అది మార్పులు చేసిన వీడియో అంటూ పోలీసుకు ఫిర్యాదు చేసింది.
గందరగోళంలో కాంగ్రెస్: బీజేపీ
గందరగోళంలో, ఆందోళనతో ఉన్న కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకోవడానికి జాతివ్యతిరేక శక్తుల వైపు నిలుస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి ఉన్న ప్రజాదరణను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే దేశ ఐక్యతను దెబ్బతీయడం కాదని నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు.
పార్టీ నేతలతో మోదీ భేటీ: జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో ఆదివారం ప్రధాని ఆదివారం బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని సమీక్షించడానికి పార్టీ చీఫ్ అమిత్ షా, మంత్రులు రాజ్‌నాథ్, జైట్లీ, సుష్మాలు ఆయనతో సమావేశమయ్యారు. జేఎన్‌యూ వివాదంతో ఈ భేటీకి సంబంధం లేదని, త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వంటివి ప్రస్తావనకు వచ్చాయన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్, లెఫ్ట్‌లు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో జేఎన్‌యూ అంశం చర్చకు ఉండొచ్చన్నారు.
కార్యక్రమానికి మద్దతుగా సయీద్ ట్వీట్లు!
అఫ్జల్ గురు ఉరికి సంబంధించి ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనకు మద్దతు తెలపాలంటూ పాక్ ప్రజలను కోరుతూ సయీద్ ట్విటర్‌లో కోరినట్టు వార్తలొచ్చాయి. అయితే ఆ ట్విటర్ ఖాతా లష్కరే నిర్వహిస్తున్నదా? కాదా? అన్న అంశంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సయీద్ ట్వీట్ వెలుగుచూసిన వెంటనే వారు అప్రమత్తం అయ్యారు. జాతి వ్యతిరేక శక్తుల మాయలో పడొద్దని విద్యార్థులను కోరుతూ పోలీసు కమిషనర్ బస్సీ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, మంగళవారం జరిగిన అఫ్జల్ కార్యక్రమానికి సంబంధించి డిబార్ అయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షుడు కన్హయ్య కుమార్ సహా 8 మందిలో కన్హయ్యను మినహా ఏడుగురు విద్యార్థులను వర్సిటీ దర్యాప్తు కమిటీ ముందుకు హాజరు కావాలని ఆదివారం ఆదేశించారు. ఆ కార్యక్రమంలో భారత వ్యతిరేక నినాదాలు చేసిన 13 మంది విద్యార్థుల ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. అరెస్టయిన కన్హయ్యపై నమోదైన దేశద్రోహం కేసును ప్రత్యేక విభాగానికి బదిలీ చేయాల దర్యాప్తు అధికారులు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులను కోరారు.
40 సెంట్రల్ వర్సిటీల మద్దతు
కన్హయ్య అరెస్టును నిరసిస్తున్న జేఎన్‌యూ విద్యార్థులు, అధ్యాపకులకు పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ వర్సిటీ సహా 40 సెంట్రల్ వర్సిటీల విద్యార్థులు, అధ్యాపకులు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వంపై విద్యార్థుల నిరసన రాజ్యాంగ విరుద్ధం, దేశ ద్రోహం కాదని కేంద్ర వర్సిటీ అధ్యాపకుల సమాఖ్య అధ్యక్షురాలు నందితా నారాయణ్ అన్నారు.చట్టం తన పని తాను చేసుకోనివ్వాలని, వర్సిటీలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని జేఎన్‌యూ వీసీ జగదీశ్ విద్యార్థులకు, అధ్యాపకులకు విజ్ఞప్తి చేశారు. 18న జరిగే వైస్ చాన్స్‌లర్ల సమావేశంలో.. వర్సిటీలో సమానత్వ సాధన, ఎస్సీ, ఎస్టీల సమస్యలకు సంబంధించిన 2012నాటి యూజీసీ నిబంధనలు చర్చకు వచ్చే అవకాశముంది.
‘నా బిడ్డను ఉగ్రవాది అనకండి’
‘దయచేసి.. నా కొడుకును ఉగ్రవాది అనకండి’ అని కన్హయ్య తల్లి మీనాదేవి ఆవేదనతో అన్నారు. బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఉంటున్న ఆమె.. కన్హయ్య అరెస్ట్ వార్తను పొరుగింట్లో టీవీలో చూసి ఈవిధంగా స్పందించారు. ‘అతడు మమ్మల్ని(తల్లిదండ్రులను) ఏనాడూ అగౌరవించలేదు. ఇక దేశాన్నెలా అగౌరవిస్తాడు? హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకించినందుకు అతన్ని వేధిస్తున్నారు’ అని పీటీఐతో చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తున్న మీనాకు నెలకు రూ. 3,500 జీతం వస్తోంది. తను, తన పెద్దకొడుకు సంపాదనే కుటుంబానికి ఆధారమని, తన భర్త ఏడేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారని ఆమె చెప్పింది.