సాక్షి, జైపూర్ : కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు అవమానం ఎదురైంది. రాజస్థాన్ పర్యటనలో ఆయనకు గౌరవ వందనం దక్కలేదు. వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన ఓ పుకారు కారణంగా కానిస్టేబుళ్లంతా ముకూమ్మడిగా విధులకు గైర్హాజర్ కావటంతో ఇది చోటు చేసుకుంది.
ఏం జరిగిందంటే...
ఇటీవలె వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పోలీస్ శాఖకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంది. అయితే దాని వల్ల వారి వేతనాల్లో భారీగా కోతలు పడబోతున్నాయంటూ.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం 24 వేలుగా ఉన్న వారి జీతాలు 19 వేలకు పడిపోతుందని అందులో పేర్కొని ఉంది. దీంతో కానిస్టేబుళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా సోమవారం జోధ్ పూర్‌లో రాజ్‌నాథ్ సింగ్ పర్యటించగా.. నిరసనలో భాగంగా సుమారు 250 మంది కానిస్టేబుళ్లు సామూహికంగా విధులకు డుమ్మా కొట్టారు. దీంతో రాజ్‌నాథ్ గౌరవ వందనం స్వీకరించలేకపోయారు.
అధికారులేం చెబుతున్నారు...
కాగా, రాజ్‌నాథ్‌కు సైనిక వందనం దక్కకపోవటంపై అధికారులు స్పందించారు. ఆ 250 మందిలో గార్డ్ ఆఫ్ ఆనర్ కోసం నియమించిన కానిస్టేబుళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వారికి ఎలాంటి లీవులు మంజూరు చేయలేదు. పైగా ఖచ్ఛితంగా విధులకు హాజరుకావాల్సిందేనని ముందస్తుగా చెప్పాం కూడా. అయినా కావాలనే వారు రాలేదు అని జోధ్ పూర్ పోలీసు కమిషనర్ అశోక్ రాథోడ్ తెలిపారు. మరోవైపు కానిస్టేబుళ్లు మాత్రం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించలేదని.. తమ ఆందోళనను, భయాన్ని కేంద్రానికి చెప్పేందుకు ఇలా చేశామంటున్నారు. ఏదిఏమైనా విధులకు డుమ్మా కొట్టినందున వీరికి నోటీసులు పంపి శాఖా పరమైన చర్యలు తీసుకోనున్నామని రాజస్థాన్ డీజీపీ అజిత్ సింగ్ తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment