
'జయగారు.. మీకు సహకరిస్తాం'
చెన్నై: వరదల బారిన పడిన తమిళనాడుకు అన్ని విధాలా సహకరిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్సింగ్ అన్నారు. ఈమేరకు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు హామీ ఇచ్చారు. గత పది రోజులకిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రోవాన్ తుఫానుగా మారి తమిళనాడు రాష్ట్రంపైన, కొన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలపైన వర్షాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే.
దీనికారణంగా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకోగా పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ జలమయమై ఉన్నాయి. చెన్నై నగరంలో వీధుల్లో చిన్నపడవల సహాయంతో తిరుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జలదిగ్బంధమైన తమ ప్రాంతాలను ఆదుకోవాలని, భారీ స్థాయిలో నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.