
భయపెడుతున్న జలాశయాలు
♦ తమిళనాడులో అనేక గ్రామాలకు వరద హెచ్చరిక
♦ ఆళయారు, మధురాంతకం జలాశయాలతో టెన్షన్
♦ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ఆదేశాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడును 20 రోజులుగా అల్లకల్లోలం చేసిన భారీ వర్షాల నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతుండగా... ఇప్పుడు నిండుకుండల్లా మారిన జలాశయాలు భయపెడుతున్నాయి. చెంబరబాక్కం, పూండి, పుళల్, ముల్లైపెరియార్, ఆళయారు, మధురాంతకం జలాశయాల్లో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. పొంగిపొర్లుతున్న జలాశయాల నుండి భారీ ఎత్తున నీటిని వదలడంతో కొన్ని ప్రాంతాల్లో వరదమట్టం పెరిగి ప్రజలు మరింత ఇబ్బందుల పాలవుతున్నారు. అనేక గ్రామాలకు సోమవారం వరద హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న రోగుల కోసం ఇతర రాష్ట్రాల నుండి ఐదు ట్యాంకర్ల ఆక్సిజన్ ట్యాంకర్లు చెన్నైకి చేరుకున్నాయి.
చెన్నైను వీడని వరద...: చెన్నై నగరాన్ని నరకంగా మార్చిన చెంబరబాక్కం జలాశయంతోపాటు పుళల్, పూండి జలాశయాల నుండి సోమవారం భారీగా నీరు విడుదల చేయడంతో వరదమట్టం పెరిగి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ఈ చెరువు నుండి ఆదివారం 3,000 ఘనపుటడుగుల నీటిని వదిలారు. అయితే సాయంత్రానికి ఎగువప్రాంతంలో భారీ వర్షాలు పడి నీటి ప్రవాహం పెరిగిపోవడంతో సోమవారం నీటి విడుదలను 4,000 ఘనపుటడుగులకు పెంచారు. మరోవైపు పూండి చెరువు నుండి 10,200, చోళవరం జలాశయం నుండి 400 ఘనపుటడుగులు నీటిని వదులుతున్నారు. చెన్నై తాగునీటి అవసరాలు తీర్చే పుళల్ చెరువు నుండి సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో 1,800 ఘనపుటడుగుల నీరు వదలడం ప్రజలను మరోసారి భయపెట్టింది.
ఎలాంటి ముంద స్తు హెచ్చరికలు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇంకా నీటమునిగి ఉన్న సామియార్ మఠం, బాబా నగర్, దండల్‌కళనీ, పుళల్ కాంజీ అరుళ్ నగర్, తిరునీలకంఠర్ నగర్, బాలాజీనగర్, మేక్రోమార్వెల్ నగర్ నివాసప్రాంతాల్లో వరదమట్టం పెరిగిపోయింది. పోరూరు జలశయానికి చేరుతున్న వరద ప్రవాహంతో చెన్నై బైపాస్ రాకపోకలకు అంతరాయం ఏర్పడే ప్రమాదం నెలకొంది.
కడలూరు జిల్లాలో వరద హెచ్చరికలు..: కడలూరు జిల్లాలో గతంలో కురిసిన వానలకు తోడు ఆదివార ం రాత్రి వరకు కురిసిన వర్షాల వల్ల కురింజిపాడి, వడ్లూరు, బన్రుట్టి తదితర 300కు పైగా గ్రామాలు నీటమునిగాయి. కడలూరుకు పక్కనే ఉన్న సేలం, విళుపురం జిల్లాల్లోని రెండు చెరువుల్లో నీటి మట్టం భారీగా పెరిగిపోవడంతో 56 ఘనపుటడుగుల నీటిని వదులుతున్నారు. ఈ ప్రవాహం కడలూరుకు చేరుతున్నందున చిదంబరం, భువనగిరి తదితర 50 గ్రామాలకు వరద హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు కడలూరు జిల్లాలో 93 మంది మరణించారు.
ముల్లైపెరియార్‌తో ముప్పు..: తమిళనాడు-కేరళ రాష్ట్రాల సరిహద్దులోని ముల్లైపెరియార్ జలాశయం నీటిమట్టం 141 అడుగులకు చేరుకోవడంతో వరద ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. తమిళనాడు-కేరళ రాష్ట్రాల సరిహద్దులోని ముల్లైపెరియార్ జలాశయం నీటి నిల్వసామర్థ్యం 142 అడుగులు కాగా సోమవారం నాటికి 141.10 అడుగులకు చేరుకుంది. దీనికి తోడు ఎగువనుంచి నిమిషానికి 1,769 ఘనపుటడుగుల నీరు చేరుతుండగా 511 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.
కోవైవాసులకు కొంతకష్టం..: కోవై జిల్లా పొల్లాచ్చి సమీపం ఆళయారు జలాశయం నిండిపోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జలాశయం నిల్వసామర్థ్యం 120 అడుగులు కాగా సోమవారానికి నీటి మట్టం 119.50కు చేరుకుంది. పైతట్టు ప్రాంతాలనుంచి భారీ ఎత్తున నీటి ప్రవాహం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.
మధురాంతకంతో టెన్షన్: కాంచీపురం జిల్లాలో ఆదివారం భారీ వర్షాలు పడటంతో మధురాంతకం చెరువు నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. పరిసరాల్లోని పది గ్రామాలకు వరద హెచ్చరికలు జారీచేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా అదేశించారు.
దెబ్బ తిన్న ఇళ్లకు రూ.10 వేలు: సీఎం జయలలిత
చెన్నై: తమిళనాడులో వరదలకు ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలకు రూ.10 వేలు నష్ట పరిహారాన్ని ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం జయలలిత సోమవారం ప్రకటించారు. దీంతోపాటు ప్రతి కుటుంబానికి తాత్కాలిక నివాసాల్ని ఏర్పాటు చేస్తామని, రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని, పది కిలోల బియ్యం, ఒక ధోవతి, ఒక చీర కూడా ఇస్తామని చెప్పారు. మరోపక్క చెన్నైకు విమానాలు, రైళ్ల రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. చెన్నై విమానాశ్రయం సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని ఎయిర్‌పోర్టు డెరైక్టర్ దీపక్ శాస్త్రి చెప్పారు. పాలు, ఇతర నిత్యావసరాల సరఫరా సోమవారం నుంచి యథావిధిగా జరుగుతోంది. సమాచార వ్యవస్థ ఇంకా మెరుగుపడలేదు. సెల్‌ఫోన్లు, ల్యాండ్‌లైన్లు పనిచేయకపోవడంతో విని యోగదారులు ఇక్కట్లకు గురవుతున్నారు.