ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసిన సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలో జోన్ల పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రం ముందు పెట్టారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ప్రతిపాదనలు అందజేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–97 అనుసరించి తెలంగాణ ప్రజలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ‘ఆర్టికల్ 371–డీ’ని కొనసాగించామని తెలిపారు. ‘రాష్ట్రపతి ఉత్తర్వులు’గా పిలుచుకునే ‘ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆర్డర్, 1975’ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 6 జోన్లు ఉండేవని వివరించారు.
విభజన అనంతరం తెలంగాణలోకి జోన్–5, జోన్–6 వచ్చాయని, మిగిలిన జోన్లు నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లాయని వివరించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించామన్నారు. ‘‘కొత్త జిల్లాల నేపథ్యంలో రాష్ట్రంలో జోన్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. ఇందుకు వీలుగా జోన్–5, జోన్–6లను జోన్లు, మల్టీ జోన్లు, స్టేట్ కేడర్‌గా పునర్ వ్యవస్థీకరించాల్సి ఉంది. సంబంధిత ప్రతిపాదనలను ఆమోదించి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేయాలి. ఈ ప్రతిపాదనలను ఆమోదించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసేలా చూడండి’’అని రాజ్‌నాథ్‌ను సీఎం కోరారు.
దాదాపు 45 నిమిషాలపాటు వీరిరువురి సమావేశం సాగింది. ఈ సందర్భంగా పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పలు అపరిష్కృత అంశాలను కూడా సీఎం హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు విభజనతోపాటు ఇతర కీలకాంశాలను చర్చించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి వెంట టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్, మిషన్ భగీరథ చైర్మన్ వి.ప్రశాంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ రెడ్డి ఉన్నారు.
ఢిల్లీలో ఒక్కరోజే..
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఒక్కరోజులోనే ముగిసింది. సోమవారం రాత్రికే సీఎం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవాల్సి ఉంది. మంగళవారం నుంచి మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ కారణంగా సోమవారం నిర్ణీత కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉన్నారని, అందుకే ప్రధాని అపాయింట్‌మెంట్ దొరకలేదని టీఆర్‌ఎస్ శ్రేణులు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment