న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. రెండురోజుల పాటు పర్యటనలో ఆయనతో పాటు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి కూడా వెళ్లనున్నారు. కశ్మీర్ లోయలో తాజా పరిస్థితులుపై ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, సీనియర్ మంత్రులతో హోంమంత్రి సమీక్షించనున్నారు. కాగా హోంమంత్రి జమ్ములో పర్యటించడం ఈ నెలలో ఇది రెండోసారి.
మరోవైపు జమ్మూకశ్మీర్లో పరిస్థితులను చక్కదిద్దాలంటూ విపక్ష నేతలు...రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. సమస్య పరిష్కారానికి ప్రధాని ఈ సందర్భంగా విపక్ష నేతలకు హామీ ఇచ్చారు. అలాగే తాజా పరిస్థితులపై రాజ్నాథ్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
కాగా ముజాహిదీన్ కమాండర్, యువ వేర్పాటువాద నేత బుర్హాన్ వాని జులై 9న భద్రతాదళాల ఎన్‌కౌంటర్లో చనిపోయిననాటి నుంచి ప్రారంభమైన ఉద్రిక్తత నేటికి 46 రోజులు దాటింది. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో 68 మంది మరణించారు. వేలమంది గాయపడ్డారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల ఆంక్షలు కొనసాగుతున్నాయి.