కూర్చొని పరిష్కరించుకోవాలి
⇒ ‘విభజన చట్టం’అంశాలపై రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ పరిష్కారమవుతాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మిగిలిన అంశాలను 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మూడేళ్ల పనితీరుపై ఆయన శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
విభజన జరిగి మూడేళ్లయినా సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని, 9, 10 షెడ్యూళ్ల సంస్థల విభజన పెండింగ్‌లో ఉందని, వీటిని ఎలా పరిష్కరిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘మేం సానుకూలంగా ఆలోచిస్తున్నాం. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. ఇందులో అనేకం పరిష్కారమయ్యాయి కూడా. మిగిలి ఉన్న అంశాలను 2రాష్ట్రాలు కలిసి కూర్చొని పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం ’అని పేర్కొన్నారు.