మంత్రిగారికి చేదు అనుభవం
శ్రీనగర్: ఇప్పటికి 45కు చేరిన మరణాలు.. 2000 మందికిపైగా గాయాలు.. రెండు వారాలుగా కర్ఫ్యూ.. కనీస అవసరాలకు ఇబ్బందులు.. ఇదీ కశ్మీర్ లోయలో పరిస్థితి. వీటిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా రెండు రోజుల పర్యటన కోసం శనివరాం కశ్మీర్ కు వచ్చిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం మధ్యాహ్నం స్థానిక వ్యాపారులతో భేటీ కావాలనుకున్నారు. కానీ అందుకు వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయలేదు. 'మేం ఆయనతో మాట్లాడబోమ'ని అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక రాజ్ నాథ్ మరో కార్యక్రమానికి వెళ్లిపోయారు.
రెండు రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా శనివారం లోయకు వెళ్లిన హోం మంత్రి పలువురు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పారమిలటరీ,సీఆర్పీఎఫ్, ఐటీబీపీ డీజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం జమ్ముకశ్మీర్ గవర్నర్ నరీంద్రనాథ్ వోరా, సీఎం మొహబూబా ముఫ్తీలతో భేటీ అనంతరం ఆదివారం మధ్యాహ్నం రాజ్ నాథ్ తిరిగి ఢిల్లీ బయలుదేరతారు.
చొరబాటుదారుల కాల్పుల్లో జవాన్ మృతి
ఉత్తర కశ్మీర్ లోని కుప్వారా జిల్లా లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ వోసీ) వద్ద చొరబాటుదారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ మరణించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ముష్కరులు చొరబాటుకు యత్నించారని, దీనిని గమనించిన పహారా బృందం ఉగ్రవాదులపై కాల్పులు జరిపిందని, ఎదురుకాల్పుల్లో జవాన్ మృతి చెందాడని ఆర్మీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి.