విజయవాడలో జరిగిన సమావేశంలో ఫ్లకార్డులు ప్రదర్శించిన చాంబర్ ప్రతినిధులు
విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డిమాండ్
గాం«దీనగర్ (విజయవాడ సెంట్రల్)/కడప కల్చరల్/తణుకు అర్బన్: కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ రావులపాలెంలో వర్తక వ్యాపారులపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులు, ఇతర వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఖండించగా, రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతకుంట పుల్లయ్య మండిపడ్డారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.విద్యాధరరావు మీడియాతో మాట్లాడారు. తక్షణమే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని, కిరాణా వ్యాపారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బాబు వ్యాఖ్యలు ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. ఎక్కడైనా కిరాణా దుకాణంలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఘటనలు రాష్ట్ర చరిత్రలో ఉన్నాయా అని ప్రశి్నంచారు. ఎక్కడో గంజాయి దొరికితే వ్యాపారులకు దాన్ని ఆపాదించడం సరికాదన్నారు. ఆర్యవైశ్యులను అవమానించడం బాబుకు అలవాటుగా మారిందని, ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు క్షమాపణ చెప్పే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ మాట్లాడుతూ బాబు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన తీరును ఖండిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఈమని దామోదర్‌రావు, మద్దాల సుధాకర్, శేగు వెంకటేశ్వర్లు, పోకూరి రమేశ్, ఎస్.వెంకటేశ్వరరావు, నాళం నాగేశ్వరరావు, మద్ది బాలు పాల్గొన్నారు.
వైశ్యుల ఆత్మగౌరవాన్ని కించపరచకండి
కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కడప నగర ఆర్యవైశ్య ప్రముఖుడు, రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతకుంట పుల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైశ్యుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడటం చంద్రబాబుకు తగదన్నారు. తక్షణమే ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆర్యవైశ్యుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటు రూపంలో తమ సమాధానం చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా శనివారం మధ్యాహ్నం గంటపాటు కిరాణా దుకాణాలను మూసివేశారు.
అంత చులకనా?: కారుమూరి
కిరాణా వ్యాపారులను గంజాయి అమ్మకందారులుగా చిత్రీకరిస్తున్న చంద్రబాబు దుర్మార్గుడని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రావులపాలెం బహిరంగ సభలో చంద్రబాబు కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ వ్యాపారులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. అధికారంలో ఉండగా ఎస్సీలు, బీసీలపై, ఈ మధ్య టిప్పర్ డ్రైవర్‌కి ఎమ్మెల్యే సీటా? అంటూ అవహేళన చేసి, తాజాగా ఆర్యవైశ్యులపై వ్యాఖ్యలు చూస్తుంటే పక్కా ప్రణాళిక ప్రకారమే పేద వర్గాలను టార్గెట్ చేస్తున్నట్టుగా అర్థమవుతోందన్నారు. చెప్పినవే కాదు.. చెప్పనివి కూడా చేసిన సీఎం వైఎస్ జగన్ సేవా రాజకీయాలు మాత్రమే చేస్తారని చెప్పడానికి గర్వపడుతున్నానని కారుమూరి అన్నారు. ఈ సమావేశంలో నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment