
విచారణ కేంద్రం పరిధిలో లేదు
‘శేషాచలం’పై హోం మంత్రి రాజ్‌నాథ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు లేకుండా శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ సాధ్యం కాదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశిస్తే రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏమవుతాయో మీకు తెలుసని విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేనుద్దేశించి వ్యాఖ్యానించారు. శేషాచలం ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఆదివాసీలు హతమైన ఘటనపై ఎంపీలు మల్లిఖార్జున్ ఖర్గే, ములాయం సింగ్ యాదవ్, తంబిదొరై లోక్‌సభలో లేవనెత్తారు.
దీనిపై మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ ఏపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది చనిపోయిన ఘటనపై ములాయం చర్చించారు. ఇటీవల ఈ అంశాన్ని సభలో లేవనెత్తగా పూర్తి వివరాలు తెలుసుకుని సభకు తెలియచేస్తానని హామీ ఇచ్చాను. ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకున్నాను. దర్యాప్తు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అక్కడి కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం నమోదైంది.
ఈ కేసులో ఇంకా నేనేమి చేయాలి? ఏం చేసినా రాజ్యాంగ నిబంధనల ప్రకారం జరగాలి. నేను ఏం చేయాలో మీరే చెప్పండి. మీరు చెప్పినట్టే నేను చేస్తాను’’ అని వారినుద్దేశించి అన్నారు. విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే జోక్యం చేసుకుని సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ‘సీబీఐ విచారణకు ఎలా ఆదేశించాలి? అలా చేయలేం’ అని రాజ్‌నాథ్ బదులిచ్చారు. తప్పు చేసినట్లు రుజువైతే అది ఎంత పెద్ద సంస్థ అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని స్పష్టం చేశారు.
ఏం చర్యలు తీసుకున్నారు?
మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించిన లోక్‌సభ ఉప సభాపతి
సాక్షి, న్యూఢిల్లీ: శేషాచలం ఎన్‌కౌంటర్‌లో 20 మంది గిరిజనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొట్టనపెట్టుకున్న ఘనటనకు సంబధించి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని లోక్‌సభ ఉప సభాపతి డాక్టర్ తంబిదురై కేంద్రాన్ని ప్రశ్నించారు. మంగళవారం ఆయన హోం శాఖ పద్దులపై ప్రసంగిస్తున్నప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు.
‘జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై విచారణ చేపట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి? క్రితంసారి హోం మంత్రి ప్రకటన చేసినప్పుడు వివరాలు తెప్పించుకుంటామన్నారు. ఆ సమాచారం సభతో పంచుకుంటారా? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?. 20 మంది గిరిజనులను చంపేశారు. దీనిపై హోం మంత్రి సమాధానం చెప్పాలి’ అని తంబిదురై డిమాండ్ చేశారు.