బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు నివేదికలు పంపినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు తెలిపారు. ఈ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం ద్వారా దర్యాప్తు జరిపించాలని కోరినట్లు చెప్పారు. ఈ స్కాంపై సీఎం కేసీఆర్ మౌనాన్ని వీడకపోతే దాన్ని ఒప్పుకున్నట్లే అవుతుందని, ఈ విషయంలో సీఎం చేస్తున్నదేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తప్పు చేసినట్లు కేసీఆర్ తన మౌనం ద్వారా ఒప్పుకుంటున్నారని భావించాల్సి ఉంటుందన్నారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గోల్డ్ స్టోన్ ప్రసాద్‌ను ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. ప్రసాద్ ఆచూకీని కనిపెట్టేందుకు పోలీస్ శాఖ లుకౌట్ నోటీస్ కూడా ఎందుకు జారీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలన్నారు. బీజేపీ నాయకులకు ఈ భూ కుంభకోణాలతో ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. గ్రూప్–2 నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే విధించడం టీఎస్‌పీఎస్సీకి చెంప పెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. కోర్టు అనర్హులుగా గుర్తించిన వారిని టీఎస్‌పీఎస్సీ ఏ విధంగా అర్హులుగా గుర్తించిందని ప్రశ్నించారు. దీనిపై టీఎస్‌పీఎస్సీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మియాపూర్ స్కాంపై కేంద్రానికి నివేదికలు
Published Wed, Jun 14 2017 3:40 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement