ఐక్య రాజ్యసమితి:జమ్మూ కాశ్మీర్ అంశంపై పొరుగు దేశం పాకిస్తాన్ మరోసారి భంగపాటు తప్పలేదు. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై తెచ్చేందుకు చేసిన యత్నం బెడిసికొట్టింది. ఇరుదేశాల మధ్య రాజుకుంటున్న ఈ అంశంపై జోక్యంచేసుకోవాలని పాకిస్థాన్ తాజాగా చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి తిరస్కరించింది. కాశ్మీర్ అంశంపై చెలరేగుతున్న విభేదాలకు భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనాలని ఐక్యరాజ్యసమితి పునరుద్ఘాటించింది. ఇరుదేశాల మధ్య సరిహద్దులో ఇటీవలి ఉద్రిక్తతలకు భారతదేశమే కారణమని, సరిహద్దులో పరిస్థితి చక్కదిద్దేందుకు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి జోక్యంచేసుకోవాలని కోరుతూ పాకిస్థాన్ ఇటీవల ఐక్యరాజ్యసమితిని కోరింది.
ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కు లేఖరాసిన సంగతి తెలిసిందే.