'పాకిస్థాన్ ఇంటర్నెట్ సంచలనం' వివాదం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఇంటర్నెట్ సంచలనం కాందీల్ బాలోచ్ మరో వివాదానికి కారణమైంది. సెల్ఫీతో మతాధికారి పదవికి ఎసరు పెట్టింది. మతాధికారి ముఫ్తీ అబ్దుల్ ఖావితో తీసుకున్న సెల్ఫీని తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఖావి పక్కన కూర్చుని ఆయనను సరదాగా ఆట పట్టించింది. ఆయన టోపీ పెట్టుకుని సెల్ఫీ తీసుకుంది. అదే సమయంలో అబ్దుల్ ఖావి సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా సెల్ఫీలో ఉంది. బాలోచ్ తో సన్నిహితంగా మెలిగినందుకు మతాధికారి పదవి నుంచి ఖావిని మతవ్యవహారాల శాఖ తొలగించింది.
కాగా, ఇఫ్తార్ విందుకు రావాలని ఖావి ఆహ్వానించడంతో ఆయన వద్దకు వెళ్లానని బాలోచ్ వెల్లడించింది. తనకు ఆయన 'ప్రపోజ్' చేశారని చెప్పి బాంబు పేల్చింది. బాలోచ్ చెప్పిన విషయాలను ఖావి తోసిపుచ్చారు. తమ విషయాలు నేర్చుకుంటానని చెప్పడంతో ఆమెను ఆహ్వానించానని ఖావి తెలిపారు. నిష్టగా రంజాన్ ఉపవాసం చేస్తానని తనకు చెప్పిందన్నారు.
కాగా, గతంలోనూ బాలోచ్ సంచలన ప్రకటనలతో వార్తల్లోకి ఎక్కింది. టీ20 ప్రపంచకప్ లో ఇండియాను పాకిస్థాన్ టీమ్ ఓడిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానని ప్రకటించి కలకలం రేపింది.