న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ వ్యాఖ్యలపై రెండోరోజు కూడా లోకసభ అట్టుడుకుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు సమాధానాలతో సంతృప్తి పడని ప్రతిపక్షాలు మంగళవారం కూడా ముఫ్తీ వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేయాలని పట్టుబట్టాయి.
బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించిన తరువాత కూడా మళ్లీ విషయాన్ని లేవనెత్తడం సబబు కాదని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మంత్రి సమాధానానికి ప్రతిగా కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మోదీ వివరణ ఇస్తే మిన్ను విరిగి మీద పడుతుందా అంటూ ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.తృణమూల్, జేడీయూ, ఆర్జేడీ సభ్యులు వెల్ లోకి దూసుకు వచ్చి నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ పదే పదే వారించినా పరిస్థితి సద్దు మణగలేదు. దీంతో సభను పదిహేను నిమిషాల పాటు మళ్లీ వాయిదా వేశారు.