
జమ్మూ కాశ్మీర్ కొత్త సీఎంగా ముఫ్తీ మహమ్మద్!
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, పీడీపీల మధ్య చర్చలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. ఓ వారం రోజుల్లో ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయ్యద్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో సయ్యద్... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.
ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై మోదీ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఆదివారం న్యూఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 87 స్థానాలు గల జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.