శ్రీనగర్: పీడీపీ ప్రెసిడెంట్ ముఫ్తి మహ్మద్ సయ్యద్ గత రెండు నెలలుగా జమ్మూ - కశ్మీర్ ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో పీడీపీకి బీజేపీ మద్దతు ఇస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే దేశానికే ఓ చారిత్రకావకాశం వచ్చినట్టు అవుతుందని ముఫ్తి అన్నారు.
ఒప్పందం పూర్తయిందా..
ఇప్పటికే ఇరు పార్టీల మధ్య ఒప్పందం కూడా కుదిరిందనే వార్తలు వస్తున్నాయి, అయితే అది ఇంకా జరగలేదు. ఆరెస్సెస్ ప్రభావంతో ఉన్న బీజేపీని జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆదరించరు. పైగా శ్యాంప్రసాద్ ముఖర్జీని అరెస్టు చేయటం కూడా బీజేపీకి కలిసి రాని అంశం. ఇదొక చరిత్రగా భావిస్తున్నారు జమ్మూ ప్రజలు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ప్రస్తుతానికి తనకు తెలిసినంత వరకు బీజేపీ ఎలాంటి సందేహం లేకుండా పీడీపీతో కలిసి పోతుందని ముఫ్తి అన్నారు. ఈ రెండు పార్టీలు కలవటం దేశంలోనే ఓ చారిత్రకమార్పు అని అన్నారు. కాగా జమ్మూ - కశ్మీర్ కేవలం ముస్లిం మెజారిటీ రాష్ట్రం. అక్కడి ప్రజలు బీజేపీని ఆహ్వానించరనేది అక్కడ వినిపిస్తున్న వాదన.
కాగా, సీఎం పీఠాన్ని దశలవారీగా రెండు పార్టీలు పంచుకోవాలని బీజేపీ రాష్ట్ర నేతలు తాజా డిమాండ్‌ను అధిష్టానం ముందు ఉంచినట్లు సమాచారం. మరోవైపు, చర్చలు కొనసాగుతున్నాయని మంగళవారం బీజేపీ నేత రామ్‌మాధవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై కచ్చితమైన గడువును పేర్కొనకుండా.. త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వస్తుందన్నారు. పీడీపీతో చర్చలు ఆయన నేతృత్వంలోనే సాగుతున్న విషయం తెలిసిందే.