పదకొండేళ్లపాటు తనను నానాయాతనలు పెట్టిన తీరును గాంధీనగర్ ఓ ఆలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తి మఫ్తీ అబ్దుల్ ఖయ్యూం వివరించాడు.
అహ్మదాబాద్: పదకొండేళ్లపాటు తనను నానాయాతనలు పెట్టిన తీరును గాంధీనగర్ ఓ ఆలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తి మఫ్తీ అబ్దుల్ ఖయ్యూం వివరించాడు. ఆ విషయాలన్నింటిని 200 పేజీల పుస్తకంలో వివరించాడు. హిందీలో రాసిన ఈ పుస్తకానికి గ్యారా సాల్ సాలఖోన్ కే పిచే(పదకొండేళ్లు జైలు లోపల) అని పేరు పెట్టాడు. 2002లో గాంధీ నగర్లో అక్షర్థామ్ ఆలయం వద్ద పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా వారి వద్ద ఓ సూసైడ్ నోట్ కనిపించింది. దీని ఆధారంగా అక్కడే ఉంటున్న మఫ్తీ అబ్దుల్ ఖయ్యూంను గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు.
దాదాపు పదకొండు సంవత్సరాలపాటు అతడిని పరివిధాల ప్రశ్నించడం, భయాందోళనలు కలిగేలా టార్చర్ పెట్టడంలాంటివి చేశారు. ఈ కేసు పలు కోణాల్లో విచారణ పూర్తవుతూ వాయిదాలు పడుతూ సుప్రీంకోర్టు వరకు రాగా.. ఈ దాడికి మఫ్తీకి సంబంధం లేదని నిరపరాధి అని గత ఏడాది మే 17న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం తన ఇంటివద్దే ఉంటున్న ఆయన తనకు నష్ట పరిహారం ఇప్పించాలని, తనపై తప్పుడు కేసులు బనాయించి ఇన్నాళ్లపాటు ఇబ్బందిపెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వాదనల సందర్భంగా ఢిల్లీ వెళ్తున్న ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. 'నాకు అన్నీ గుర్తున్నాయి. ఏ కారణం లేకుండా పదకొండేళ్లపాటు ఒళ్లుగగుర్పొడిచేలా పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం. నా పరువు, నా కుటుంబ ప్రతిష్ఠ అంతాపోయింది. ఈ విషయాలన్నీ నేను నా పుస్తకంలో రాశాను. విచారణ సమయంలో వాళ్లు ఎన్ని రకాల టార్చర్లు పెట్టారో వాటన్నింటిని అందులో పేర్కొన్నాను' అని చెప్పారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పారు.