రెండు రోజుల్లో నిర్ణయం!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అధికార పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) సందిగ్ధంలో పడింది. ముఫ్తీ ఆరోగ్య పరిస్థితి కుదుటపడకుంటే ఏం చేయాలనే దానిపై పీడీపీ సమాలోచనలు జరుపుతోంది. ఆయన కోలుకోకపోతే అసెంబ్లీలో పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.
ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి లేకుండా కేబినెట్ సమావేశం సాధ్యం కాదు. అయితే తమ ముందు రెండు మార్గాలు ఉన్నాయని పీడీపీ వర్గాలు వెల్లడించాయి. సీఎం పేరుతో ముందుకెళ్లడం లేదా సంకీర్ణ భాగస్వామిని సంప్రదించి మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించాలని పేర్కొన్నాయి. ఒకవేళ మరొకరిని ముఖ్యమంత్రిని చేయాల్సివస్తే సయీద్ కుమార్తె, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వైపు పార్టీ ఏకగ్రీవంగా మొగ్గుచూపే అవకాశముందని తెలిపాయి.
ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్న సయీద్ గత రెండు వారాలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.