Jammu and Kashmir CM
-
ఒమర్, రిజిజు భేటీపై రాజకీయ వివాదం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్లో కలుసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. వక్ఫ్ చట్టం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) సానుకూల వైఖరి అవలంబించిన నేపథ్యంలోనే వీరిద్దరు కలుసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, తన తండ్రి, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కోరిక మేరకు తులిప్ గార్డెన్‌కు వెళ్లిన ఒమర్‌కు అనూహ్యంగా అదే రోజు ఉదయం గార్డెన్‌కు వచ్చిన మంత్రి రిజిజు కలిశారని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ అంటోంది. యోగక్షేమాలు తెలుసుకున్న అనంతరం ఎవరికి వారు వెళ్లిపోయారని చెబుతోంది. ఇదంతా కేవలం అనుకోకుండా జరిగిన పరిణామమని, దీన్ని అనవసరంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించింది. అయితే, రిజిజు ‘ఎక్స్’లో అబ్దుల్లాలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయడం వివాదాన్ని రేపింది. వక్ఫ్ సవరణ చట్టంపై బీజేపీకి ఎన్సీకి లొంగిపోయిందని ప్రతిపక్ష పీడీపీ ఆరోపించింది. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రిజిజుకు తులిప్ గార్డెన్లో ఎన్సీ ఎర్ర తివాచీ పరిచిందని మరో నేత అన్నారు. సీఎం ఒమర్ తులిప్ గార్డెన్లో తారసపడిన కేంద్ర మంత్రి రిజిజుకు కనీసం దూరంగా ఉండటం ద్వారా నిరసన తెలిపి ఉండాల్సిందని పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజాద్ లోనె పేర్కొన్నారు. -
జమ్మూ, కశ్మీర్ ఇండియా ఆత్మ!
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ ఇండియాకు ఆత్మ వంటిదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇక్కడి ప్రజలు భారత్‌ను తమ దేశంగా భావిస్తున్నారని ఆమె చెప్పారు. తాజాగా పుల్వామా జిల్లాలో జరిగిన హింసపై ఆమె స్పందిస్తూ.. పాఠశాలలో చదివే విద్యార్థులంతా రాళ్లు రువ్వటంలేదని అందులో కొందరే నిరసనలు తెలుపుతారని పేర్కొన్నారు. సోమవారమిక్కడ పౌర సచివాలయాన్ని ప్రారంభించినంతరం కాసేపు ఆమె విలేకర్లతో మాట్లాడారు. 1947నుంచి ఇక్కడ ఎన్నో దురదృష్టకర సంఘటనలు జరిగాయని, ప్రస్తుతం మరొసారి కశ్మీర్ రోడ్డుపైకి ఎక్కిందని పేర్కొన్నారు. జాతీయ మీడియా ఇక్కడి ప్రజల ఆగ్రహావేశాలు రెచ్చగొట్టేలా చర్చలు జరపరాదని సూచించారు. 1950లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్)అనుగుణంగా పాలన 22ఏళ్లు కొనసాగిందని ఆమె గుర్తుచేశారు. ప్రధాని ఇందిరా– ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా హయాంలో జరిగిన ఒప్పందం చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారమని అప్పటి నాయకత్వం భావించిందన్నారు. 1990లో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయన్నారు. ఒక్కొసారి లోయలో ఉగ్రచర్యలు ఉండవని, మరొక్కసారి విపరీతంగా ఉంటాయని చెప్పారు. ఇక్కడి ప్రజలకు కేవలం రాష్ట్రంపైనే కాక దేశమంతటా హక్కు ఉంటుందని నొక్కిచెప్పారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. -
రెండు రోజుల్లో నిర్ణయం!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అధికార పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) సందిగ్ధంలో పడింది. ముఫ్తీ ఆరోగ్య పరిస్థితి కుదుటపడకుంటే ఏం చేయాలనే దానిపై పీడీపీ సమాలోచనలు జరుపుతోంది. ఆయన కోలుకోకపోతే అసెంబ్లీలో పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి లేకుండా కేబినెట్ సమావేశం సాధ్యం కాదు. అయితే తమ ముందు రెండు మార్గాలు ఉన్నాయని పీడీపీ వర్గాలు వెల్లడించాయి. సీఎం పేరుతో ముందుకెళ్లడం లేదా సంకీర్ణ భాగస్వామిని సంప్రదించి మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించాలని పేర్కొన్నాయి. ఒకవేళ మరొకరిని ముఖ్యమంత్రిని చేయాల్సివస్తే సయీద్ కుమార్తె, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వైపు పార్టీ ఏకగ్రీవంగా మొగ్గుచూపే అవకాశముందని తెలిపాయి. ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్న సయీద్ గత రెండు వారాలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఢిల్లీకి కశ్మీర్ సీఎం తరలింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్(79) తన నివాసంలో గురువారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విమానంలో ఢిల్లీకి తరలించారు. జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో ఆయనను చేర్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్ లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో మార్చిలో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.