జమ్మూ, కశ్మీర్ ఇండియా ఆత్మ!
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ ఇండియాకు ఆత్మ వంటిదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇక్కడి ప్రజలు భారత్‌ను తమ దేశంగా భావిస్తున్నారని ఆమె చెప్పారు. తాజాగా పుల్వామా జిల్లాలో జరిగిన హింసపై ఆమె స్పందిస్తూ.. పాఠశాలలో చదివే విద్యార్థులంతా రాళ్లు రువ్వటంలేదని అందులో కొందరే నిరసనలు తెలుపుతారని పేర్కొన్నారు.
సోమవారమిక్కడ పౌర సచివాలయాన్ని ప్రారంభించినంతరం కాసేపు ఆమె విలేకర్లతో మాట్లాడారు. 1947నుంచి ఇక్కడ ఎన్నో దురదృష్టకర సంఘటనలు జరిగాయని, ప్రస్తుతం మరొసారి కశ్మీర్ రోడ్డుపైకి ఎక్కిందని పేర్కొన్నారు. జాతీయ మీడియా ఇక్కడి ప్రజల ఆగ్రహావేశాలు రెచ్చగొట్టేలా చర్చలు జరపరాదని సూచించారు. 1950లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్)అనుగుణంగా పాలన 22ఏళ్లు కొనసాగిందని ఆమె గుర్తుచేశారు.
ప్రధాని ఇందిరా– ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా హయాంలో జరిగిన ఒప్పందం చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారమని అప్పటి నాయకత్వం భావించిందన్నారు. 1990లో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయన్నారు. ఒక్కొసారి లోయలో ఉగ్రచర్యలు ఉండవని, మరొక్కసారి విపరీతంగా ఉంటాయని చెప్పారు. ఇక్కడి ప్రజలకు కేవలం రాష్ట్రంపైనే కాక దేశమంతటా హక్కు ఉంటుందని నొక్కిచెప్పారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.