కశ్మీర్ సీఎం కన్నుమూత
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ గురువారం ఉదయం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న ఆయనకు జ్వరం, ఛాతినొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్కు తరలించి.. ఐసీయూలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ముఫ్తీ తుదిశ్వాస విడిచారని జమ్ముకశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీం అఖ్తర్ తెలిపారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. ముఫ్తీ కూతురు మహబూబ్ ముఫ్తీ ఆయన వారసురాలిగా సీఎం పగ్గాలు చేపట్టే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. గతంలో ముఫ్తీ కూడా ఇదే విషయాన్ని ఓసారి స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్ 12వ ముఖ్యమంత్రిగా పీడీపీ అగ్రనేత ముఫ్తీ మహ్మద్ సయీద్(79) 2015 మార్చి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పీడీపీ.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీ వ్యవస్థాపకుడైన ముఫ్తీ మహ్మద్ సయీద్ కశ్మీర్ సీఎంగా పదవి చేపట్టడం ఇది రెండోసారి. గతంలో 2002 నుంచి పీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లపాటు సారథ్యం వహించారు.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ముఫ్తీ మహమ్మద్ సయీద్ 1987 వరకు మొదట కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1987లో ఫరుఖ్ అబ్దుల్లా ప్రభుత్వం పడిపోవడానికి ప్రధాన కారణం ముఫ్తినే అంటారు. ఆ తర్వాత ఆయన వీపీ సింగ్ నేతృత్వంలోని జన్ మోర్చాలో చేరి.. దేశ తొలి హోంమంత్రిగా 1989 వరకు కేంద్ర మంత్రిమండలిలో కొనసాగారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి పీవీ నరసింహారావు హయాంలో పనిచేశారు. 1999లో కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని కూతురు మహబూబా ముఫ్తీతో కలిసి జమ్ముకశ్మీర్ పీపుల్ డెమొక్రటిక్ పార్టీని స్థాపించారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 18 సీట్లు గెలువడంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అత్యధిక సీట్లు సాధించడంతో బీజేపీతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
దేశ హోంమంత్రిగా..
రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన ముఫ్తీ మహమ్మద్ కుటుంబం లక్ష్యంగా పలుమార్లు మిలిటెంట్లు దాడులు చేశారు. కశ్మీర్‌లో భారత పాలనను వ్యతిరేకిస్తున్న వేర్పాటువాదులు ముఫ్తీని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. 1989లో ముఫ్తీ కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూతురు రుబియాను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో జైల్లో ఉన్న ఐదుగురు ఉగ్రవాదుల విడుదల చేయించడం ద్వారా తన కూతురును ముఫ్తీ విడిపించుకున్నారు.