Jammu Kashmir Chief Minister
-
ఉద్రిక్తతల వల్ల పాకిస్తాన్‌కే నష్టం
జమ్మూ: సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగడం పాకిస్తాన్నే దెబ్బతీస్తుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఉద్రిక్తతలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని పాక్‌కు సూచించారు. లేదంటే వారికి ఎక్కువ నష్టమని హెచ్చరించారు. గురువారం రాత్రి పాకిస్తాన్ చేసిన దాడుల్లో ఒక్క డ్రోన్ కూడా లక్ష్యాన్ని చేరుకోకుండా వేగంగా స్పందించిన సాయుధ దళాలను ఒమర్ ప్రశంసించారు. జమ్మూ, సాంబా జిల్లాల్లోని సహాయ శిబిరాలను, సరిహద్దు రేఖ వెంబడి పాక్ షెల్లింగ్‌లో గాయపడిన వారున్న ఆసుపత్రులను సందర్శించిన సీఎం.. విజయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘1971 యుద్ధం పాక్ చేసిన అత్యంత తీవ్రమైన దాడులివే.. జమ్మూలోని పలు ప్రాంతాలు, అనంత్‌నాగ్‌లోని మందుగుండు సామగ్రి డిపోను లక్ష్యంగా చేసుకున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగడం పాక్‌ను దెబ్బతీస్తుంది. దీనివల్ల పాకిస్తాన్‌కు ఒరిగేదేమీ లేదు. ఆ దేశం విజయం సాధించలేదు. కాబట్టి వారు తుపాకులను పక్కన పెట్టి సాధారణ స్థితిని తీసుకురావడానికి సహకరిస్తే మంచిది. గురువారం రాత్రి తరువాత జరిగిన సంఘటనలు ఉద్రిక్తతను పెంచే ప్రయత్నాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. దీనివల్ల వారే ఎక్కువగా బాధపడతారు’’అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. పూంచ్‌లో పరిస్థితి క్లిష్టంగా ఉంది పాక్ షెల్లింగ్ వల్ల పూంచ్ నగరానికి భారీ నష్టం వాటిల్లిందని, పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది అక్కడి వారేనన్నారు. తాను జమ్మూలోని ఆస్పత్రిని సందర్శించానని, గాయాలతో అక్కడ అడ్మిడ్ అయిన వారంతా పూంచ్‌కు చెందిన వారేనని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని శస్త్రచికిత్స కోసం పీజీఐ చండీగఢ్‌కు తరలించామన్నారు. జమ్మూ జిల్లాలోని మిష్రివాలా, నాగ్బానీ, కోట్ భల్వాల్, సాంబాలోని విజయపూర్ పునరావాస శిబిరాలను సందర్శించిన ఆయన నిర్వాసిత కుటుంబాలతో మాట్లాడి, వారికి ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. శిబిరాల్లో అసౌకర్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఆట సామగ్రి కావాలని అడిగిన పిల్లలకు.. తన సొంత వాహనంలో తెచ్చి అప్పగించిన మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు. -
కేబినెట్ సమావేశం నుంచి సీఎం వాకౌట్!
సాధారణంగా ప్రభుత్వం ఏదైనా చెప్పినప్పుడు తమకు నచ్చకపోతే ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తాయి. కానీ మంత్రివర్గ సమావేశం జరుగుతున్నప్పుడు.. మంత్రులతో వచ్చిన విభేదాల కారణంగా ఏకంగా ముఖ్యమంత్రే ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ ఘటన జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో చోటుచేసుకుంది. అలా వెళ్లిపోయిన సీఎం.. మెహబూబా ముఫ్తీ. సంకీర్ణ ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులతో వచ్చిన విభేదాల కారణంగా ఆమె వెళ్లిపోయారు. కశ్మీర్ పోలీస్ సర్వీస్.. కేపీఎస్ను పునర్వ్యవస్థీకరించే విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. పునర్వ్యవస్థీకరణకు ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ సహా బీజేపీ మంత్రులంతా ససేమిరా అనడంతో మెహబూబా ముఫ్తీ (57)కు ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో ఒక్క ఉదుటన లేచి, సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత బీజేపీ మంత్రులంతా కలిసి ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. దీనిపై మరింత గొడవ జరగకుండా ఉండేందుకు కొంతమంది బీజేపీ మంత్రులు సీఎం నివాసానికి హుటాహుటిన వెళ్లారు. జమ్ము కశ్మీర్లో పీడీపీ, బీజేపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఈ రెండు పార్టీలు కలిశాయి. -
ప్రెస్‌మీట్ చాలు.. ఇక వెళ్లి టీ తాగండి: సీఎం
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి కోపం వచ్చింది. గతంలో మీరు కశ్మీర్లో భద్రతాదళాల మోహరింపును, కర్ఫ్యూల విధింపును వ్యతిరేకించారు కదా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చింది. తాను చెప్పదలచుకున్న నాలుగు ముక్కలు చెప్పేసి.. ''థాంక్యూ, ప్రెస్‌మీట్ అయిపోయింది.. ఇక వెళ్లి టీ తాగండి' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సాక్షిగానే ఇదంతా జరిగింది. 2010లో కూడా ఇలాగే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పుడు మీ విధానం వేరుగా ఉంది కదా అని విలేకరులు పదే పదే ప్రశ్నించడంతో ఆమెకు కోపం వచ్చింది. బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా ఆమె మీడియా ముందుకు వచ్చారు. 2010 అల్లర్లను నాటి సీఎం ఒమర్ అబ్దుల్లా సరిగా నియంత్రించలేదని, అందుకే వంద మందికి పైగా మరణించారని మెహబూబా చెప్పారు. ప్రస్తుత ఆందోళనను కేవలం 5 శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నారని, మిగిలిన 95 శాతం మంది శాంతినే కోరుకుంటున్నారని అన్నారు. అప్పట్లో బూటకపు ఎన్కౌంటర్లు, మానవహక్కుల ఉల్లంఘన, అత్యాచారాలు, హత్యలు.. ఇలాంటివన్నీ ఉన్నాయని, వాటికి వ్యతిరేకంగానే అల్లర్లు జరిగాయని చెప్పారు. ఇప్పుడు ముగ్గురు ఉగ్రవాదులను చంపినందుకు అల్లర్లు చేస్తున్నారని.. జనం రోడ్డుమీదకు వస్తున్నందుకే కర్ఫ్యూ పెట్టామని.. అలంటప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టడం ఎందుకని మెహబూబా అడిగారు. ఆర్మీక్యాంపుల మీద దాడి జరిగినప్పుడే వాళ్లు కాల్పులు జరుపుతున్నారని.. అమాయకులైన పిల్లలను అనవసరంగా ఎందుకు వీటిలోకి లాగుతున్నారని ప్రశ్నించారు. ఇదే సమయంలో విలేకరులు పదే పదే ప్రశ్నించడంతో తీవ్ర అసహనానికి గురైన ఆమె.. ప్రెస్‌మీట్‌ను అర్ధంతరంగా ముగించి, ''ఇక చాలు, వెళ్లి టీ తాగండి' అని చెప్పారు. -
పత్రికల ప్రచురణపై నిషేధం విధించలేదు
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో పత్రికలపై నిషేధం విధించలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ.. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు తెలిపారు. కల్లోల పరిస్థితులు నెలకొన్న కశ్మీర్లో ఇంగ్లీషు, ఉర్దూ, కశ్మీరీ భాషల్లో వెలువడుతున్న పత్రికల ముద్రణను పోలీసు అధికారులు నిలిపివేసినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు.. సోమవారం రాత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కశ్మీర్లో కర్ఫ్యూ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రచురణను ఆపాల్సిందిగా పత్రికాధిపతులను, ఎడిటర్లను కశ్మీర్ మంత్రి, ప్రభుత్వ ప్రతినిధి కోరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగాఈ వార్తలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి అమితాబ్ మట్టూ తోసిపుచ్చారు. కశ్మీర్లో భద్రత బలగాలు హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీతో పాటు అతని ఇద్దరు సహాయకులను కాల్చిచంపిన తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో 30 మందికిపైగా మరణించారు. పదిరోజుల నుంచి కశ్మీర్లో కర్ఫూ వాతావరణం ఏర్పడింది. -
సీఎంకు ఈసీ నోటీసులు
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా మఫ్తీకి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసులు పంపించింది. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆమె ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించారని అందులో పేర్కొంది. దానికి గల కారణాలు ఏమిటో వెంటనే తెలియజేయాలని ఈసీ ఆదేశించింది. అనంత్ నాగ్ నియోజక వర్గం నుంచి మహబూబా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జూన్ 1న ఆమె ఇందుకోసం నామినేషన్ దాఖలు చేసేందుకు కార్లో వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణించిన కారులో జాతీయ జెండాలతోపాటు రాష్ట్ర జెండాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనావళి ప్రకారం అది విరుద్ధం కావడంతో ఆమెకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ శాంతమను నోటీసులు జారీ చేశారు. మరుసటి రోజే ఆమెకు నోటీసులు పంపిచినట్లు చెప్పారు. -
కశ్మీర్ సీఎం సయీద్ అస్తమయం
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్(79) గురువారం ఉదయం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనంతరం, గురువారం సాయంత్రం ఆయన స్వస్థలమైన అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహరలో అంత్యక్రియలు నిర్వహించారు. డిసెంబర్ 24న తీవ్ర అస్వస్థతకు గురైన సయీద్‌ను ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి తీసుకువచ్చి, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో చేర్పించారు. ప్రాణాంతక సెప్సిస్ ఇన్ఫెక్షన్తో, న్యుమోనియాతో బాధ పడ్తున్న ఆయన్ను కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే గురువారం ఉదయం ఆయన మరణించారు. అనంతరం, వైమానిక దళ ప్రత్యేక విమానంలో త్రివర్ణ పతాకం, తెలుపు, ఎరుపు వర్ణాల జమ్మూకశ్మీర్ రాష్ట్ర జెండాలతో కప్పిన ఆయన పార్థివ దేహాన్ని శ్రీనగర్‌కు తరలించారు. ప్రజల సందర్శనార్ధం శ్రీనగర్‌లోని నివాసంలో కొద్దిసేపు మృతదేహాన్ని ఉంచారు. సాయంత్రం బిజ్‌బెహరలో వందలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య, ప్రభుత్వ లాంఛనాలతో మృతదేహాన్ని ఖననం చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆజాద్, ఒమర్‌లు సయీద్ శవపేటికను తమ భుజాలపై మోసి, గౌరవం ప్రకటించారు. పాలెం విమానాశ్రయంలో మృతదేహానికి ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర కేబినెట్ సమావేశమై రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మృతికి సంతాపసూచకంగా గురువారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల్లో జాతీయ పతాకాలను అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి చనిపోయిన వారిలో ముఫ్తీ మొహమ్మద్ రెండో వారు. మొదటి వ్యక్తి 1982లో చనిపోయిన షేక్ మొహమ్మద్ అబ్దుల్లా. తదుపరి సీఎం మెహబూబా ముఫ్తీ సయీద్ ఆకస్మిక మరణంతో కశ్మీర్ తదుపరి సీఎంగా ఆయన కూతురు, ఎంపీ, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ(56) బాధ్యతలు స్వీకరించనున్నారు. జమ్మూకశ్మీర్ పీడీపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా మొహబూబాను ఏకగ్రీవంగా ఎన్నుకుని, ఆ సమాచారాన్ని గవర్నర్‌కు ఇచ్చారు. సంకీర్ణ పక్షమైన బీజేపీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మెహబూబా కశ్మీర్ తొలి మహిళా సీఎం కానున్నారు. దేశానికి తీరని లోటు సయీద్ మృతిపట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయ చాతుర్యానికి, దార్శనికతకు ఆయన ప్రతీక అని సంతాప సందేశంలో రాష్ట్రపతి ప్రణబ్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చే నేతగా సయీద్‌ను ఉపరాష్ట్రపతి హమీద్ అభివర్ణించారు. సయీద్ మృతి దేశానికి తీరని లోటు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సయీద్ మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం వ్యక్తం చేశారు. కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: సయీద్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ డిమాండ్‌కు దేశవ్యాప్తంగా మద్ధతు కూడగడుతున్న సమయంలో సయీద్ అండగా నిలిచారన్నారు. వ్యక్తిగతంగా ముఫ్తీతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సయీద్ మృతిపై వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. సయీద్ కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి ప్రకటించారు. సంక్షుభిత కశ్మీర్లో శాంతి స్థాపనకు కృషిచేసిన సయీద్ గొప్ప రాజనీతిజ్ఞుడని ఆయన ప్రశంసించారు. -
కశ్మీర్ సీఎం కన్నుమూత.
-
కశ్మీర్ సీఎం కన్నుమూత
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ గురువారం ఉదయం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న ఆయనకు జ్వరం, ఛాతినొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్‌కు తరలించి.. ఐసీయూలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ముఫ్తీ తుదిశ్వాస విడిచారని జమ్ముకశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీం అఖ్తర్ తెలిపారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. ముఫ్తీ కూతురు మహబూబ్ ముఫ్తీ ఆయన వారసురాలిగా సీఎం పగ్గాలు చేపట్టే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. గతంలో ముఫ్తీ కూడా ఇదే విషయాన్ని ఓసారి స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ 12వ ముఖ్యమంత్రిగా పీడీపీ అగ్రనేత ముఫ్తీ మహ్మద్ సయీద్(79) 2015 మార్చి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పీడీపీ.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీ వ్యవస్థాపకుడైన ముఫ్తీ మహ్మద్ సయీద్ కశ్మీర్ సీఎంగా పదవి చేపట్టడం ఇది రెండోసారి. గతంలో 2002 నుంచి పీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లపాటు సారథ్యం వహించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ముఫ్తీ మహమ్మద్ సయీద్ 1987 వరకు మొదట కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1987లో ఫరుఖ్ అబ్దుల్లా ప్రభుత్వం పడిపోవడానికి ప్రధాన కారణం ముఫ్తినే అంటారు. ఆ తర్వాత ఆయన వీపీ సింగ్ నేతృత్వంలోని జన్ మోర్చాలో చేరి.. దేశ తొలి హోంమంత్రిగా 1989 వరకు కేంద్ర మంత్రిమండలిలో కొనసాగారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి పీవీ నరసింహారావు హయాంలో పనిచేశారు. 1999లో కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని కూతురు మహబూబా ముఫ్తీతో కలిసి జమ్ముకశ్మీర్ పీపుల్ డెమొక్రటిక్ పార్టీని స్థాపించారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 18 సీట్లు గెలువడంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అత్యధిక సీట్లు సాధించడంతో బీజేపీతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దేశ హోంమంత్రిగా.. రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన ముఫ్తీ మహమ్మద్ కుటుంబం లక్ష్యంగా పలుమార్లు మిలిటెంట్లు దాడులు చేశారు. కశ్మీర్లో భారత పాలనను వ్యతిరేకిస్తున్న వేర్పాటువాదులు ముఫ్తీని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. 1989లో ముఫ్తీ కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూతురు రుబియాను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో జైల్లో ఉన్న ఐదుగురు ఉగ్రవాదుల విడుదల చేయించడం ద్వారా తన కూతురును ముఫ్తీ విడిపించుకున్నారు. -
ఐసీయూలో జమ్ము కశ్మీర్ సీఎంకు చికిత్స
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్‌ను బుధవారం ఐసీయూకు తరలించారు. సయీద్‌కు ఆక్సిజన్ థెరఫీ అవసరమని, వైద్య నిపుణుల బృందం ఆయన పరిస్థితిని సమీక్షిస్తోందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. 79 ఏళ్ల సయీద్ స్పృహలో ఉన్నారని వైద్యులు చెప్పారు. ఈ నెల 24న జమ్ము కశ్మీర్ సీఎంకు జ్వరం, ఛాతినొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్లో ఢిల్లీకి తరలించి ఎయిమ్స్‌లో చేర్చారు. సయీద్‌కు తోడుగా ఆయన కుమార్తె, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వచ్చారు. మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఎయిమ్స్‌ను సందర్శించి సయీద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పీడీపీ.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.