కేబినెట్ సమావేశం నుంచి సీఎం వాకౌట్!
మంత్రివర్గ సమావేశం జరుగుతున్నప్పుడు.. మంత్రులతో వచ్చిన విభేదాల కారణంగా ఏకంగా ముఖ్యమంత్రే ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
సాధారణంగా ప్రభుత్వం ఏదైనా చెప్పినప్పుడు తమకు నచ్చకపోతే ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తాయి. కానీ మంత్రివర్గ సమావేశం జరుగుతున్నప్పుడు.. మంత్రులతో వచ్చిన విభేదాల కారణంగా ఏకంగా ముఖ్యమంత్రే ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ ఘటన జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో చోటుచేసుకుంది. అలా వెళ్లిపోయిన సీఎం.. మెహబూబా ముఫ్తీ. సంకీర్ణ ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులతో వచ్చిన విభేదాల కారణంగా ఆమె వెళ్లిపోయారు. కశ్మీర్ పోలీస్ సర్వీస్.. కేపీఎస్‌ను పునర్వ్యవస్థీకరించే విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి.
పునర్వ్యవస్థీకరణకు ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ సహా బీజేపీ మంత్రులంతా ససేమిరా అనడంతో మెహబూబా ముఫ్తీ (57)కు ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో ఒక్క ఉదుటన లేచి, సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత బీజేపీ మంత్రులంతా కలిసి ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. దీనిపై మరింత గొడవ జరగకుండా ఉండేందుకు కొంతమంది బీజేపీ మంత్రులు సీఎం నివాసానికి హుటాహుటిన వెళ్లారు. జమ్ము కశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఈ రెండు పార్టీలు కలిశాయి.