కశ్మీర్ సీఎం సయీద్ అస్తమయం
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్(79) గురువారం ఉదయం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనంతరం, గురువారం సాయంత్రం ఆయన స్వస్థలమైన అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్బెహరలో అంత్యక్రియలు నిర్వహించారు. డిసెంబర్ 24న తీవ్ర అస్వస్థతకు గురైన సయీద్‌ను ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి తీసుకువచ్చి, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో చేర్పించారు. ప్రాణాంతక సెప్సిస్ ఇన్‌ఫెక్షన్‌తో, న్యుమోనియాతో బాధ పడ్తున్న ఆయన్ను కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే గురువారం ఉదయం ఆయన మరణించారు.
అనంతరం, వైమానిక దళ ప్రత్యేక విమానంలో త్రివర్ణ పతాకం, తెలుపు, ఎరుపు వర్ణాల జమ్మూకశ్మీర్ రాష్ట్ర జెండాలతో కప్పిన ఆయన పార్థివ దేహాన్ని శ్రీనగర్‌కు తరలించారు. ప్రజల సందర్శనార్ధం శ్రీనగర్లోని నివాసంలో కొద్దిసేపు మృతదేహాన్ని ఉంచారు. సాయంత్రం బిజ్బెహరలో వందలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య, ప్రభుత్వ లాంఛనాలతో మృతదేహాన్ని ఖననం చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆజాద్, ఒమర్‌లు సయీద్ శవపేటికను తమ భుజాలపై మోసి, గౌరవం ప్రకటించారు.
పాలెం విమానాశ్రయంలో మృతదేహానికి ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర కేబినెట్ సమావేశమై రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మృతికి సంతాపసూచకంగా గురువారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల్లో జాతీయ పతాకాలను అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి చనిపోయిన వారిలో ముఫ్తీ మొహమ్మద్ రెండో వారు. మొదటి వ్యక్తి 1982లో చనిపోయిన షేక్ మొహమ్మద్ అబ్దుల్లా.
తదుపరి సీఎం మెహబూబా ముఫ్తీ
సయీద్ ఆకస్మిక మరణంతో కశ్మీర్ తదుపరి సీఎంగా ఆయన కూతురు, ఎంపీ, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ(56) బాధ్యతలు స్వీకరించనున్నారు. జమ్మూకశ్మీర్ పీడీపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా మొహబూబాను ఏకగ్రీవంగా ఎన్నుకుని, ఆ సమాచారాన్ని గవర్నర్‌కు ఇచ్చారు. సంకీర్ణ పక్షమైన బీజేపీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. మెహబూబా కశ్మీర్ తొలి మహిళా సీఎం కానున్నారు.
దేశానికి తీరని లోటు
సయీద్ మృతిపట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయ చాతుర్యానికి, దార్శనికతకు ఆయన ప్రతీక అని సంతాప సందేశంలో రాష్ట్రపతి ప్రణబ్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చే నేతగా సయీద్‌ను ఉపరాష్ట్రపతి హమీద్ అభివర్ణించారు. సయీద్ మృతి దేశానికి తీరని లోటు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సయీద్ మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: సయీద్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ డిమాండ్‌కు దేశవ్యాప్తంగా మద్ధతు కూడగడుతున్న సమయంలో సయీద్ అండగా నిలిచారన్నారు. వ్యక్తిగతంగా ముఫ్తీతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సయీద్ మృతిపై వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. సయీద్ కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి ప్రకటించారు. సంక్షుభిత కశ్మీర్‌లో శాంతి స్థాపనకు కృషిచేసిన సయీద్ గొప్ప రాజనీతిజ్ఞుడని ఆయన ప్రశంసించారు.