ఐసీయూలో జమ్ము కశ్మీర్ సీఎంకు చికిత్స
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ను బుధవారం ఐసీయూకు తరలించారు. సయీద్కు ఆక్సిజన్ థెరఫీ అవసరమని, వైద్య నిపుణుల బృందం ఆయన పరిస్థితిని సమీక్షిస్తోందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. 79 ఏళ్ల సయీద్ స్పృహలో ఉన్నారని వైద్యులు చెప్పారు.
ఈ నెల 24న జమ్ము కశ్మీర్ సీఎంకు జ్వరం, ఛాతినొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్లో ఢిల్లీకి తరలించి ఎయిమ్స్లో చేర్చారు. సయీద్కు తోడుగా ఆయన కుమార్తె, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వచ్చారు. మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఎయిమ్స్ను సందర్శించి సయీద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న పీడీపీ.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.