'కాశ్మీరీలను దేశభక్తి నిరూపించుకోమనడం సరికాదు'
హైదరాబాద్/ జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్లో ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోని ప్రొగ్రెసివ్ డెమాక్రటిక్ ఫ్రంట్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని బీజేపీ సీనియర్ నేత, జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ సమర్థించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ సమాన భాగస్వామి కావడం దేశభద్రతకు మంచిదని, ఈ ప్రయోగం సఫలమైతే జాతీయవాదానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పీడీపీతో పొత్తు చర్చల్లో కీలక పాత్ర వహించిన రామ్ మాధవ్ జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ సంస్థ నిర్వహించిన సదస్సులో జాతీయ భద్రత - జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ వరకూ అన్న అంశంపై ప్రసంగించారు. ఇరు పార్టీల మధ్య రాజకీయ అంశాల్లో వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమేనని, ఇది రాజకీయ పొత్తు కాదని, పీడీపీ- బీజేపీలది పరిపాలనాపరమైన పొత్తు అని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇచ్చినతీర్పును గౌరవించి తాము పీడీపీతో అధికారంలో పాలుపంచుకుంటున్నామని అన్నారు. దేశ భద్రతకు, దేశ సమైక్యతకు ఏ మాత్రం భంగం కలిగితే బిజెపి ప్రభుత్వం నుంచి వైదొలిగేందుకు వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ ఉన్నంత వరకూ వేర్పాటు వాద శక్తులకు అంగుళం కూడా తావివ్వబోమని ఆయన ప్రకటించారు. సైన్య బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విషయంలో ఎలాంటి రాజీకీ తావుండబోదని కూడా ఆయన అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 67 శాతం మంది ప్రజలు కాశ్మీర్ లోయలో ఓటు వేసి, ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ధిక్కరించారని ఆయన అన్నారు. కాశ్మీర్ లోయ ప్రజలను తమ దేశభక్తిని నిరూపించుకొమ్మని పదేపదే అడగడం సరైనది కాదని కూడా ఆయన అన్నారు. కాశ్మీరీ ప్రజలను కలుపుకుపోవాలే తప్ప వేరు చేయడం సరికాదని ఆయన అన్నారు.
కాశ్మీరీ పండితులను తిరిగి కాశ్మీర్ కి సగౌరవంగా తీసుకువచ్చే విషయంలో, వారికి భద్రత, రక్షణ కల్పించే విషయంలో తొలి దఫా చర్చలు పూర్తయ్యాయని, కాశ్మీర్ లోని శరణార్థులకు పునరావాసం కల్పించే విషయంలో చర్యలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం ఏడాది పాలన గురించి ప్రస్తావిస్తూ దేశం సురక్షితమైన నాయకత్వం చేతుల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు సైతం విమర్శించలేనంత మంచి పాలనను మోదీ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని నిరాశ నుంచి ఆశ వైపు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని సూట్ బూట్ ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్ గత పదేళ్లుగా ఇచ్చింది లూట్ ఝూట్ (దోపిడీ, అబద్దాల పాలన) పాలన అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి సంస్థ అధ్యక్షులు టీ హనుమాన్ చౌదరి, జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ అధ్యక్షులు ప్రొ. తిరుపతి రావులు కూడా ప్రసంగించారు.