జమ్మూ: విపక్ష నాయకులపై బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సినిమాటిక్ స్టైల్‌లో విమర్శలు గుప్పించారు. ప్రముఖ బాలీవుడ్ చిత్రం దీవార్ డైలాగ్‌ను గుర్తుకు తెచ్చేలా ఆయన పంచ్‌లు పేల్చారు. ప్రతిపక్షాల కూటమిలో నరేంద్ర మోదీ వంటి శక్తి సామర్థ్యాలు కలిగిన నేత ఎవరు లేరని ఎద్దేవా చేశారు. అందుకే వారు కూటమిగా ఏర్పరడ్డారని విమర్శించారు. కానీ.. హమారే పాస్ మోదీ హై( మా దగ్గర మోదీ ఉన్నారు) అని వ్యాఖ్యానించారు. మోదీ భారత్‌ను అవినీతి రహిత, తీవ్రవాద రహిత దేశంగా మార్చారని పునరుద్ఘాటించారు. విపక్షాల కూటమిలో ఎక్కువ మందికి ప్రధాని సీటు పైనే దృష్టి ఉందని.. వారు విజయం సాధించలేరని అన్నారు.
మరోవైపు జుమ్మూ కశ్మీర్‌లోని కథువాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కుటుంబాలు ఇక్కడి ప్రజల జీవితాలను నాశనం చేశాయని ఆరోపించారు. తొలి దశలో ఓటు వినియోగించుకున్న బారాముల్లా, జమ్మూ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.ఇక్కడి ఓటర్లు పోలింగ్‌ను పెంచడం ద్వారా భారతదేశ ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో చాటిచెప్పారని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు తమ ఓటుతో ఉగ్రవాద నాయకులకు, అవకాశవాదులకు ధీటైన జవాబు చెప్పారని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశలో బారాముల్లా, జమ్మూలో ఎన్నికల జరిగాయి. రెండో దశలో ఉద్దంపూర్, శ్రీనగర్‌లో పోలింగ్ జరగనుంది. అనంత్‌నాగ్‌లో మాత్రం మూడు, నాలుడు, ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లడఖ్‌లో ఐదో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment