న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పొత్తు తెంచుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. కాషాయదళం వైదొలగడంతో ప్రస్తుతం కశ్మీర్‌లోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడినట్లయింది. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ కశ్మీర్ ఇన్‌ఛార్జ్ రాం మాధవ్ ఇక పీడీపీతో కలిసి ప్రభుత్వంలో కొనసాగలేమని, తమ మంత్రులను ఉప సంహరించుకుంటున్నామని చెప్పారు. ‘కాశ్మీర్‌లో ఉగ్రవాదం పెరుగుతోంది. శాంతి భద్రతలు కరువయ్యాయి. ఇంకా చెప్పాలంటే పత్రికా స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్ర్యానికి ప్రమాదం వాటిల్లింది. పట్టపగలే జర్నలిస్ట్ బుఖారిని ఉగ్రవాదులు హత్య చేశారు. ఉగ్రవాదులను నియంత్రించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేసింది.
జాతీయ ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి వైదొలిగాం. పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గవర్నర్ పాలనతో పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని ఆశిస్తున్నాం. రంజాన్ కాల్పుల విరమణకు ఉగ్రవాదులు, వేర్పాటువాదుల నుంచి సానుకూల స్పందన రాలేదు. మూడేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగించాం. కేంద్రం సాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అయితే పరిస్థితులు చేయిదాటుతున్న నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగలేం. 600మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు నిర్మూలించాయి. గవర్నర్ పాలనలో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కొనసాగుతాయని’ బీజేపీ నేత రాం మాధవ్ వివరించారు.
సీఎం మెహబూబా ముఫ్తీ రాజీనామా
సంకీర్ణ ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించిన కొంత సమయానికే సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో చేసేదేం లేక మెహబూబా ముఫ్తీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందంపై మిత్రపక్షాలు బీజేపీ-పీడీపీల మధ్య విభేదాలు కీలక పరిణామాలకు దారితీసిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని పీడీపీ పట్టుపట్టగా, బీజేపీ అందుకు ఒప్పుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment