సామరస్య సారథికి సలాం | Jammu and Kashmir cm mufti mohammad died | Sakshi
Sakshi News home page

సామరస్య సారథికి సలాం

Published Sun, Jan 10 2016 1:51 AM | Last Updated on Mon, Jul 30 2018 8:14 PM

సామరస్య సారథికి సలాం - Sakshi

సామరస్య సారథికి సలాం

త్రికాలమ్
కశ్మీర్‌పైన తిరిగి కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. పఠాన్‌కోట మీదా, అఫ్ఘానిస్తాన్‌లో మజారే షరీఫ్‌లోని భారత దౌత్య కార్యాలయంపైనా దాడి చేయడానికి కారణం కశ్మీరీ ప్రొఫెసర్ అఫ్జల్ గురును ఉరితీయడమేనంటూ ఉగ్రవాదులు ప్రకటించారు. ఉగ్రవాదులు కశ్మీర్‌ను ప్రశాంతంగా ఉండనీయరనేది స్పష్టం. ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి పదవి మెహబూబాకు అగ్నిపరీక్ష.
 
సోదరులను హత్య చేసి, తండ్రిని నిర్బంధించి సింహాసనం అధిష్టించిన మొఘల్ చక్రవర్తి ఎవరో అందరికీ తెలుసు. పెద్దకొడుకు దారా సుఖో షాజహాన్‌కు వారసుడు కావలసినవాడు. తమ్ముడు ఔరంగజేబు అధికార దాహానికీ, అమానుషానికీ తక్కిన తమ్ముళ్లు షా షుజా, మురాద్ బక్ష్‌తో పాటు బలైనవాడు దారా. అతడు వీరుడే కాకుండా తత్త్వశాస్త్రం అధ్యయనం చేసిన మేధావి. ఖురాన్‌లో ప్రస్తావించిన ‘కితాబ్ అల్ మఖ్నూన్’ (నిక్షిప్తగ్రంథం) ఉప నిషత్తులేనని బలంగా నమ్మిన వ్యక్తి. బెనారస్ పండితుల సహకారంతో ఉపనిష త్తులను పార్సీలోకి అనువదించిన ఘనుడు. హిందూ, ఇస్లాం మతాల మధ్య వైరుధ్యం లేదని విశ్వసించిన సూఫీ మత ప్రచారకుడు ఖాద్రీ పరంపరను పాటించి, మియా మీర్ శిష్యరికం చేసినవాడు. అటువంటి దారా దారిలో జీవితాంతం నడిచిన సామరస్యవాది గురువారం కన్నుమూసిన కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్.

స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జమ్మూ-కశ్మీర్ పాకిస్తాన్‌లో కాకుండా భారత్‌లో విలీనం కావడానికి ప్రధాన కారకుడు ప్రజానాయకుడు షేక్ అబ్దుల్లా. శ్రీనగర్‌కీ, ఢిల్లీకీ వారధిగా నిలిచిన రాజనీతిజ్ఞడు ముఫ్తీ సాహెబ్. సామరస్య సాధనే ఆయన రాజకీయ జీవిత లక్ష్యం. జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించి భారత్‌లో హిందువులదీ, మహమ్మదీయులదీ ఒకే జాతి అంటూ చాటిన వ్యక్తి ముఫ్తీ. భారత్ ఎప్పటికైనా పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాలు నెలకొల్పుకోవాలనీ, అప్పుడే కశ్మీర్ సుస్థిరంగా, ప్రశాంతంగా మనగలుగుతుందనీ ముఫ్తీ విశ్వాసం. దారా సుఖోతో పాటు జవహార్‌లాల్ నెహ్రూ కూడా ఆయనకు ఆదర్శం. ‘మై తో నెహ్రూ జమానా కే నేతా హూ’ అనేవారు. ఆయనది గంగా-జమునీ తెహజీబ్.  ముఫ్తీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం ఉంది. ఫారుఖ్ అబ్దుల్లాతో ఇందిరాగాంధీకి విభేదాలు వచ్చినప్పుడు ముఫ్తీ ముఖ్యమంత్రి కావలసింది. కానీ ఫారుఖ్ జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేయవలసిందిగా సిఫార్సు చేయడంతో అప్పటి అవకాశం చేజారింది.

లేకపోతే 41 ఏళ్లకే ముఖ్యమంత్రి పదవి వరించేది. ప్లెబిసైట్ ప్రతిపాదనకు స్వస్తి చెప్పేందుకు అంగీకరించారనే కారణంగా ఫారుఖ్ పట్ల ఇందిరకు కొంత సానుకూలత ఉండేది. కాంగ్రెస్ పార్టీతో రాజీ పడి తిరిగి అధికారంలోకి వచ్చిన ఫారుఖ్‌ని నేషనల్ కాన్ఫరెన్స్‌లో చీలిక తేవడం ద్వారా పడగొట్టి ముఫ్తీ ప్రతీకారం తీర్చుకున్నారు. రాజీవ్‌గాంధీ మంత్రిమండలిలో టూరిజం శాఖ నిర్వహించిన ముఫ్తీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌తో పాటు ప్రభుత్వం నుంచి వైదొలిగి జనమోర్చా నెలకొల్పారు. 1989 ఎన్నికలలో గెలిచిన నేషనల్ ఫ్రంట్ నేతగా వీపీ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఫ్తీ వీపీ సింగ్ ప్రభుత్వంలో దేశీయాంగశాఖ మంత్రి. చిన్న కుమార్తె రుబయ్యా సయీద్‌ను అపహరించిన జమ్మూ-కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) నాయకులతో చర్చలు జరిపి కూతురిని విడిపించుకున్నారు. ఈ కారణంగా కశ్మీర్‌లో తీవ్రవాదం ప్రబలిందని పరిశీలకుల అభిప్రాయం.

అణచివేత, హింసాకాండ
ముఫ్తీ హోంశాఖ నిర్వహిస్తున్న సమయంలోనే కశ్మీర్‌లో భద్రతా దళాలు తీవ్రవాదులనూ, వేర్పాటువాదులనూ ఉక్కుపాదంతో అణచివేశాయి. సాధారణ పౌరులు అనేక మంది మరణించారు. కశ్మీర్‌లో భారత్  పట్ల వ్యతిరేకత ప్రబలింది. ఆ దశలో ముఫ్తీ సహచరులలో చాలామంది వేర్పాటువాద శిబిరంలో చేరిపోయారు. ముఫ్తీ మాత్రం ప్రధాన రాజకీయ స్రవంతిలోనే కొనసాగారు. 1999లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)ని నెలకొల్పి నేషనల్ కాన్ఫరెన్స్‌కి ప్రత్యామ్నాయ ప్రాంతీయ పార్టీగా నిలిచారు. 2002 ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముఫ్తీ సామరస్య విధానాలను అమలు పరిచారు. ఇన్‌సానియత్ (మానవత్వం) అనే మాటను ఆయన పదే పదే ఉపయోగించేవారు. కార్గిల్ యుద్ధం, పార్లమెంటు భవనంపైన ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్‌తో చర్చలు జరపవలసిందిగా నాటి ప్రధాని వాజపేయిని ముఫ్తీ ప్రోత్సహించారు. ఇన్‌సానియత్‌తో పాటు జమ్రూహియత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ (కశ్మీర్ సంస్కృతీ సంప్రదాయాలు) అనే మూడు స్తంభాలపైనే కశ్మీర్ శాంతి సౌధం సగర్వంగా నిలబడాలనేది వాజపేయి వాదం. ముఫ్తీ అభిప్రాయం కూడా అదే.  ‘హీలింగ్ టచ్’ అనే విధానం ద్వారా కశ్మీరీల హృదయాలలో గాయాలను మాన్పించే ప్రక్రియకు ముఫ్తీ శ్రీకారం చుట్టారు. పాకిస్తాన్ పట్ల త్రిముఖ వ్యూహం అమలు చేయాలని వాజపేయి సంకల్పించింది ముఫ్తీ ప్రోద్బలంతోనే. పాకిస్తాన్‌తో, వేర్పాటువాదులతో విడివిడిగా చర్చలు జరపుతూనే కశ్మీర్ ప్రజల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నది వ్యూహం.  

2004లో యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలసి ఇదే వ్యూహాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. ముఫ్తీ 2005లో ముఖ్యమంత్రి పదవిని గులాం నబీ ఆజాద్‌కు అప్పగించినప్పటికీ కశ్మీర్‌లో ‘హీలింగ్ టచ్’ విధానం కొనసాగింది. దీని ఫలితం 2005 నుంచి కనిపించింది. 2004లో సుమారు 4000 మంది కశ్మీర్ లోయలో హింసాకాండకు బలైనారు. ఈ సంఖ్య 2008 నాటికి 150కి తగ్గింది. పరిపాలనా యంత్రాంగాన్ని పటిష్ఠంగా నడిపిం చడం ముఫ్తీ హయాంలో స్పష్టంగా కనిపించిన మార్పు.  ఆ రోజుల్లో లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే ఉద్యమం సాగుతోంది.  లే, కార్గిల్ హిల్ కౌన్సిల్స్‌ను నెలకొల్పి అధికార వికేంద్రీకరణ చేసిన ఫలితంగా ఆ ప్రాంతంలో అభివృద్ధి స్పష్టంగా కనిపించింది. ప్రజలు శాంతించారు. శ్రీనగర్- ముజఫరాబాద్ రహదారిని ముఫ్తీతో కలసి నాటి  ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు. రెండు ప్రాంతాల మధ్య వ్యాపార సంబంధాలు మొదలైనాయి. విద్యా సంస్థలూ, ఆసుపత్రులూ నెలకొల్పారు. పారా మిలిటరీ ఆపరేషన్స్ గ్రూపులను ఉపసంహరించారు. లోగడ పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన మిలిటెంట్లను తిరిగి రావ లసిందిగా ఆహ్వానించారు. కొంతమంది వెనక్కి వచ్చారు.  కశ్మీర్ పండిట్‌లు తిరిగి వస్తే వారి నివాసానికి అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ వారికి విశ్వాసం కలగలేదు. తిరిగి రాలేదు.

ప్రత్యర్థితో కలసి ప్రభుత్వం
ఒమర్ అబ్దుల్లా అధికారంలోకి వచ్చిన తర్వాత కశ్మీర్‌లో మళ్లీ హింస పెరిగింది. రాళ్లు రువ్వుతున్న యువకులపై సాయుధ పోలీసులు కాల్పులు జరపడంతో 2010 వేసవిలో వందమందికి పైగా మరణించారు. కేంద్ర ప్రభుత్వం పట్ల విశ్వాస రాహిత్యం, దశాబ్దాల తరబడి నిర్దాక్షిణ్యంగా అణచివేయడం కారణంగా  కశ్మీరీల హృదయాలలో ఆగ్రహం రగులుతూ ఉంటుంది. ముఫ్తీ మానవీయ విధానాలు కొంతకాలం అశాంతికి అడ్డుకట్ట వేయగలిగాయి.

అదే ముఫ్తీ 2014 ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా మునుపటి ‘హీలింగ్ టచ్’ కనిపించలేదు. ఎన్నికలలో హోరాహోరీ పోరాడిన ప్రధాన ప్రత్యర్థి బీజేపీతో ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక్క ముఫ్తీ మహమ్మద్ సయీద్‌కి మాత్రమే సాధ్యం. దీనిని అవకాశవాదంగా ఎవ్వరూ ఆక్షేపించలేదు. సామరస్యవాదిగా ముఫ్తీ రాజీవ్‌తో, వీపీ సింగ్‌తో, వాజపేయితో, సోనియాగాంధీతో, మన్మోహన్ సింగ్‌తో వ్యవహారం చేసినట్టే నరేంద్రమోదీతోనూ కలసి అడుగులు వేయగలి గారు. పీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికే నాలుగు నెలలపాటు సుదీర్ఘ సమాలో చనలు జరపవలసి వచ్చింది. ముఫ్తీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కూడా సంకీర్ణ సమస్యలతో కొంత, విధానాల పట్ల విభేదాలతో కొంత, కేంద్రం నుంచి నిధుల రాబట్టుకోవడానికి ప్రయత్నించడంతో కొంత సమయం వృధా అయిపోయింది. నిజానికి ముఫ్తీ మొదటిసారి ముఖ్యమంత్రిగా అమలు చేసిన విధానాల ఊసు ఇంత వరకూ లేదు.

తొలి మహిళా ముఖ్యమంత్రి
ఈసారి ముఖ్యమంత్రిగా మెహబూబానే ప్రమాణం చేయాలన్నది ముఫ్తీ అభిమతం. వార్థక్యం, అనారోగ్యం కారణంగా పదవీ బాధ్యతలు నిర్వ హించలేనని చెప్పారు. తాను డ్రాయింగ్ రూంలో కూర్చొని మాట్లాడే రాజకీయవాదిని మాత్రమేననీ, నిజమైన ప్రజానాయకురాలు తన కూతురేననీ, పార్టీని బలోపేతం చేసిందీ, ఎన్నికలలో గెలిపించిందీ ఆమేననీ సందర్భం వచ్చినప్పుడల్లా అనేవారు. సంతాపదినాలు పూర్తయిన తరువాత మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఇండియాలో  మహమ్మదీయులు మెజారిటీగా ఉన్న ఒకే ఒక రాష్ట్రం జమ్మూ-కశ్మీర్. అటువంటి రాష్ట్రానికి ఒక మహిళ ముఖ్యమంత్రి కావడం చరిత్ర. తండ్రి వలె కాకుండా మెహబూబాకు దూకుడు ఎక్కువ. ఇద్దరు కూతుళ్లతో ఒంటరి తల్లిగా జీవిస్తున్న మెహబూబాకు ఢిల్లీలోనూ, శ్రీనగర్‌లోనూ శ్రేయోభిలాషులు అనేకమంది ఉన్నారు. వేర్పాటు వాదులతో సైతం ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సొంత పార్టీలో ముఠాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవికి తాము మాత్రమే సరిపోతామని భావించే సీనియర్లూ ఉన్నారు. వారందరినీ దారిలో పెట్టి తండ్రి ఆచరించిన సామరస్య విధానాలను అమలు చేయడం ఎట్లా అన్నది 56 సంవత్సరాల మెహబూబా ఎదుట ఉన్న పెనుసవాలు.

అయితే మెహబూబా విచారం నుంచి కోలుకునే దాకా బాధ్యతలు స్వీకరించరని వార్తలు వచ్చాయి. అందుకే జమ్మూ- కశ్మీర్‌లో తాత్కాలికంగా గవర్నర్ పాలన విధించారు. కశ్మీర్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించిన మెహబూబా పార్టీ వ్యవహారాలు చక్కబెట్టగలరు కానీ బీజేపీతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకురాగలరా అన్నది సందేహం. పైగా కశ్మీర్‌పైన తిరిగి కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. పఠాన్‌కోట మీదా, అఫ్ఘానిస్తాన్‌లో మజారే షరీఫ్‌లోని భారత దౌత్య కార్యాలయంపైనా దాడి చేయడానికి కారణం కశ్మీరీ ప్రొఫెసర్ అఫ్జల్ గురును ఉరితీయడమేనంటూ ఉగ్రవాదులు ప్రకటించారు. ఉగ్రవాదులు కశ్మీర్‌ను ప్రశాంతంగా ఉండనీ యరనేది స్పష్టం. ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి పదవి మెహబూబాకు అగ్నిపరీక్ష.

 కె.రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement