
ఉగ్రవాదులను కట్టడి చేయండి
పాకిస్తాన్‌ను కోరిన కశ్మీర్ సీఎం సయీద్
జమ్మూ: కశ్మీర్‌లో వెంటవెంటనే జరిగిన రెండు ఉగ్రవాద దాడులను జమ్మూకశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఖండించారు. ఉగ్రవాదులను కట్టడిచేయాలని పాకిస్తాన్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. శుక్ర, శనివారాల్లో ఉగ్రవాదులు ఓ పోలీస్‌స్టేషన్, ఓ సైనిక శిబిరంపై దాడికి పాల్పడ్డం తెలిసిందే. దీన్ని ఖండిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. రెండు దేశాలమధ్య శాంతికి విఘాతం కలిగించేలా హింసకు పాల్పడుతున్న ఉగ్రవాదులను కట్టడి చేయాల్సిందిగా పాక్‌కు సూచించాలని ఈ తీర్మానం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రజలు ఇటువంటి ఉగ్రవాద చర్యలకు బెదిరిపోరని సయీద్ అన్నారు.
భారత్‌తో శాంతి సంబంధాలను కోరుకుంటున్నట్లయితే హింసా శక్తులను అదుపులో పెట్టాలని పాక్‌కు సూచించారు. పాక్ ప్రమేయాన్ని ఎత్తి చూపకుండా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులను అరికట్టడానికి సరిహద్దుల్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దాడులను ఖండి స్తూ తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీక ర్ తిరస్కరించడంపై నిరసన వ్యక్తంచేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ వాకౌట్ చేసింది. ఈ అంశంపై చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ కూడా ఉభయ సభల్లో పట్టుబట్టింది. ఉగ్రవాదులు సొంతంగానే దాడులు చేస్తున్నారని సీఎం చెబుతుంటే, ఉపముఖ్యమంత్రి మాత్రం పాక్ సర్కారు, ఐఎస్‌ఐ హస్తం ఉందంటున్నారని పేర్కొంది.
‘ఉగ్ర’ వాతావరణం వద్దు: రాజ్‌నాథ్
సరిహద్దు వెంట ‘ఉగ్ర’ వాతావరణంలేకుండా చూడాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్‌ను కోరారు. అట్టారీ సరిహద్దులో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
బాసిత్‌తో మీర్వాయిజ్ భేటీ
హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ భారత్‌లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను ఢిల్లీలో కలిశారు.
కశ్మీర్ తీవ్రవాదంపై శ్వేతపత్రం
జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. ప్రజలకు సమాచారం కోసం రాష్ట్రంలోని తీవ్రవాదం, దాని చుట్టూ ఉన్న అనేక అంశాలతో కూడిన శ్వేతపత్రాన్ని వెలువరించాలని హోం మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంట్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.