
సయీద్ వ్యాఖ్యలపై దుమారం
జమ్మూ/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఉగ్రవాద సంస్థలు, పాక్, హురియత్‌ల ఔదార్యమే కారణమంటూ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ చిచ్చు రాజేయగా.. ఆయన పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యేల బృందం ఏకంగా ఉగ్రవాది అఫ్జల్ గురు భౌతిక అవశేషాలను తమకందజేయాలంటూ సోమవారం కేంద్రాన్ని డిమాండ్ చేసి ఆ వేడిని మరింత పెంచింది. పీడీపీ తీరుతో రాష్ట్రంలో ఆ పార్టీతో అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ ఇరుకున పడుతోంది.
పాక్, వేర్పాటువాద సంస్థ హురియత్, ఉగ్రవాద సంస్థలు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించారంటూ, ఎన్నికల ప్రశాంత నిర్వహణ ఘనత వారిదేనంటూ ఆదివారం సీఎంగా ప్రమాణం చేయగానే సయీద్ చేసిన వ్యాఖ్య రాజకీయంగా పెద్ద దుమారం లేపింది. పార్లమెంటు ఉభయసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తిన ప్రతిపక్షాలు.. దీనిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని, సయీద్ వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశాయి. సయీద్ వ్యాఖ్యలతో కేంద్రానికి, బీజేపీకి సంబంధం లేదని, ఈ విషయంపై ప్రధానితో మాట్లాడి, ఆయన అనుమతితోనే ఈ ప్రకటన చేస్తున్నానంటూ లోక్‌సభలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన వివరణతో విపక్షాలు తృప్తి చెందలేదు.
స్వయంగా తానే ప్రధానితో పాక్ ఉగ్ర సంస్థల ఔదార్యం గురించి చెప్పానని సయీద్ ప్రకటించినందువల్ల.. ఈ విషయంపై మోదీనే స్పందించాలని డిమాండ్ చేస్తూ.. లోక్‌సభ నుంచి విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. మరోపక్క.. సయీద్ ఆదివారం నాటి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన వాదనకు కట్టుబడి ఉన్నానని సోమవారం సచివాలయంలో బాధ్యతల స్వీకరణ అనంతరం స్పష్టం చేశారు. ‘బుల్లెట్ల కన్నా, గ్రెనేడ్ల కన్నా ఓటరు స్లిప్పులు(ప్రజాస్వామ్యం) బలమైనవన్న విషయం వారు(పాక్, హురియత్) గుర్తించారు. ప్రజలు అవే కోరుకుంటున్న విషయం వారు అర్థం చేసుకున్నారు’ అని వివరించారు. కాగా, సయీద్ వ్యాఖ్యలు రాజకీయ గిమ్మిక్కులని హురియత్ కాన్ఫరెన్స్ విమర్శించింది.
అసెంబ్లీ స్పీకర్ పదవి బీజేపీకి?
కశ్మీర్ అసెంబ్లీ కొత్త స్పీకరు పదవి బీజేపీకి దక్కనుంది. పీడీపీ-బీజేపీల కూటమి స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కవీందర్ గుప్తాను ఎన్నుకునే అవకాశముంది. ప్రభుత్వ ఏర్పాటుకోసం ఇరు పార్టీలూ ఓ ఫార్ములాను ఏర్పర్చుకున్నాయని, దానికే కట్టుబడి ఉండేలా ఇరుపార్టీ నేతలతో కూడిన సమన్వయ కమిటీ చూసుకుంటుందని ఈ మేరకు బీజేపీ వర్గాలు తెలిపాయి.