జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కన్నుమూతపై రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కన్నుమూతపై రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అంటూ సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇలా నాయకులంతా ఆయన మృతిపై ప్రగాఢ సంతాపం తెలిపారు.
ముఫ్తీ సయీద్ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.
- ప్రణబ్‌ముఖర్జీ, రాష్ట్రపతి
ముఫ్తీ సయీద్ మృతి తీవ్ర బాధాకరం. ఆయన మరణం జమ్ముకశ్మీర్‌కు, దేశ రాజకీయాలకు తీరని లోటు. సామాన్యులు, పేద ప్రజలంటే అమితంగా ఇష్టపడే నాయకుడు ఆయన. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన సంక్లిష్టతలను బాగా ఎరిగిన నేత. కశ్మీర్‌లోయలో శాశ్వత శాంతిని తీసుకురావాలని నిరంతరం తపించేవారు.
- రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి
ముఫ్తీ సయీద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, గుజరాత్ సీఎం ఆనందిబెన్, బీజేపీ నేత రాంమాధవ్ తదితర నేతలు ముఫ్తీ సయీద్ మృతి పట్ల సంతాపం తెలిపారు.