Raj Kundra Arrest: పెగాసస్ వివాదం కుదిపేస్తున్న టైంలో.. ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ ఫైనాన్సర్ రాజ్ కుంద్ర(46) పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడన్న ఆరోపణలపై రాజ్ కుంద్రాను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముంబై పోలీసులు ఇప్పటిదాకా ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.
ముంబై: లండన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెబ్ సిరీస్‌ల పేరుతో పోర్న్, సెమీ పోర్న్ కంటెంట్‌ను తీయడంతో పాటు వాటిని కొన్ని యాప్‌ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నాడంటూ ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం విచారణ పేరిట బైకుల్లాలోని తమ ఆఫీస్‌కు రప్పించుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అటు నుంచి అటే కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఈ మొత్తం పోర్న్ మాఫియాకు రాజ్ కుంద్రానే సూత్రధారి అని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత నగ్రాలే నిర్ధారించారు.
ఆ లింక్‌తో..
ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఉత్తర ముంబై మలాద్‌లో మదా ఐల్యాండ్‌లోని ఓ భవనంలో బూతు సినిమాలు తీస్తున్న ఓ ముఠాను ముంబై ప్రాపర్టీ సెల్(స్పెషల్ పోలీస్) అరెస్ట్ చేసింది. మొత్తం 9 మందిలో నటి కమ్ మోడల్స్ గెహానా వశిష్ఠ్, రోవా ఖాన్ కూడా ఉన్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో యూకే ప్రొడక్షన్ కంపెనీ కెన్‌రిన్ ఉండడం, దానికి ఉమేశ్ కామత్ హెడ్ కావడం, ఉమేశ్ ఇదివరకు కుంద్రా దగ్గర పని చేయడంతో ప్రాపర్టీ సెల్ విభాగం ఇన్‌స్పెక్టర్ కేదార్ పవార్, కుంద్రాపై దృష్టిసారించాడు. ఈ క్రమంలో గతంలో ఓసారి కుంద్రాని పోలీసులు ప్రశ్నించారు కూడా. ఈ మేరకు పక్కా ఆధారాలు సేకరించాకే రాజ్ కుంద్రాని సోమవారం అరెస్ట్ చేసినట్లు ముంబై కమిషనర్ తెలిపారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం కుంద్రాను జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు.
Actress Shilpa Shetty's husband & businessman Raj Kundra has been taken for medical examination at JJ hospital by Property Cell of Mumbai Police's Crime Branch.He was later taken to Mumbai Police Commissioner's office.#shilpashettykundra #RajKundraArrest pic.twitter.com/KeM346ZUzd
— MBC TV ODISHA (@MBCTVODISHA) July 20, 2021
ఈజీ మనీ కోసం..
లైవ్ స్రీ‍్టమింగ్ యాప్‌లు, ఐపీఎల్‌లు పెద్దగాకలిసి రాకపోవడంతో తప్పుడు దారిలో సంపాదన కోసమే ఆయన ఈ పని చేసినట్లు ముంబై పోలీసులు నిర్ధారించుకున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రాజ్ కుంద్రా యువతులను తన మీడియేటర్ల ద్వారా ట్రాప్‌లోకి దించాడని తెలుస్తోంది. ఈ మేరకు తమతో అగ్రిమెంట్లు చేయించుకున్నాక బలవంతంగా పోర్న్ సినిమాలు తీయించినట్లు బాధితుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు పోలీసులు. హాట్‌షాట్స్, హాట్‌హిట్‌మూవీస్ లాంటి బీ, సీ గ్రేడ్ యాప్స్ కొన్నింటిలో ఆ వీడియోలను అప్‌లోడ్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్‌లలో సైతం వాటిని పోస్ట్ చేయాలని సదరు నటీమణులను ఒత్తిడి చేయడం, ట్విటర్ పేజీలతో ప్రమోట్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసులు నిర్ధారించారు.
శాలువా బిజినెస్ నుంచి..
పంజాబీ కుటుంబానికి చెందిన రాజ్ కుంద్రా స్వస్థలం లూథియానా. చిన్నతనంలోనే అతని ఫ్యామిలీ లండన్‌కు వలస వెళ్లింది. కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్‌గా, తల్లి ఓ చిన్నషాపులో పని చేసేది. 18 వయసులో దుబాయ్ అక్కడి నుంచి నేపాల్ వెళ్లిన కుంద్రా.. శాలువాల బిజినెస్ చేశాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తెలివిగా వాటిని బ్రిటన్‌కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కంపెనీలకు విక్రయించి కోట్లు సంపాదించాడు. 2004లో బ్రిటిష్-ఏషియన్ రిచ్చెస్ట్ పర్సన్ లిస్ట్‌లో 198వ ర్యాంక్ దక్కించుకున్నాడు కూడా. 2007కి తిరిగి దుబాయ్‌కు వెళ్లి.. కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్‌లో అడుగుపెట్టాడు. ఆ టైంలోనే బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్సింగ్ మొదలుపెట్టాడు. సంజయ్ దత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ల పరిచయాలతో పలు స్పోర్ట్స్ బిజినెస్, లైవ్-బ్రాడ్‌కాస్ట్, గేమింగ్ సంబంధిత వ్యవహారాలతో లెక్కలేనంత సంపాదించాడు. 2009లో నటి శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నాడు(కుంద్రాకు రెండో వివాహం). ఆపై ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, అటుపై బెట్టింగ్-వివాదాల వ్యహారంతో కుదేలు అయ్యాడు. 2019లో రాజ్ కుంద్రాకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద అవార్డు కూడా దక్కింది. ఇక తనకు సంబంధించిన న్యూడ్ ఫొటోలు, వీడియోలను తన అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారంటూ నటి, మోడల్ పూనమ్ పాండే సైతం రాజ్ కుంద్రాపై ఓ దావా వేయగా, ఆ కేసు బాంబే హైకోర్టులో నడుస్తోంది కూడా.
Comments
Please login to add a commentAdd a comment