లలిత్ మోదీని కలిసిన ముంబై పోలీసు కమిషనర్
ముంబై: మనీ లాండరింగ్ సహా ఇతర ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్‌కు పరారైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. మోదీని ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మరియా గతేడాది లండన్‌లో కలిశారని వెలుగు చూసింది. లండన్‌లోని మాఫియా వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఆ విషయంలో సాయం చేయాలంటూ ముంబై పోలీసులను కోరిన నేపథ్యంలో మోదీని రాకేశ్ కలిశారు. మోదీ న్యాయవాది పట్టుబట్టడంతో తాను లలిత్ మోదీని కలిసింది వాస్తవమేనని రాకేశ్ అంగీకరించారు.
అయితే, తాను లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే హోం మంత్రికి ఆ విషయం తెలియజేశానని తెలిపారు. లలిత్ మోదీ, రాకేశ్ మరియా కలిసి ఉన్న ఫొటోను శనివారం తొలుత ఓ టీవీ చానెల్ ప్రసారం చేయడంతో దుమారం రేగింది. దీంతో రాకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాది జూలైలో అధికారికంగా ఓ సదస్సులో పాల్గొనేందుకు తాను లండన్ వెళ్లానని, ఆ సందర్భంగా మోదీ తరఫున ఓ న్యాయవాది పట్టుబట్టడంతో ఆయనను కలిశానని వివరించారు. అయితే, లండన్‌లో ముంబై పోలీసులు చేసేదేమీ ఉండదని, ముంబైకి వచ్చే ఫిర్యాదు చేయాలని మోదీకి సూచించానని చెప్పారు.