సైబర్ నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకునేందుకు వాడే దాదాపు 4.5 లక్షల ‘మ్యూల్’(మనీ లాండరింగ్ కోసం వాడే ఖాతాలు) బ్యాంక్ ఖాతాలను కేంద్రం స్తంభింపజేసింది. సైబర్ మోసగాళ్లు ఈ మ్యూల్ ఖాతాల ద్వారానే లావాదేవీలు జరుపుతున్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారులు తెలిపారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో జరిగిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు.
బ్యాంకింగ్ వ్యవస్థలో మ్యూల్ ఖాతాలను వినియోగించుకుని సైబర్ నేరస్థులు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తంగా 4.5 లక్షల మ్యూల్ ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిపారు. అందులో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
I4C సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్‌బీఐలోని వివిధ శాఖల్లో సుమారు 40,000 మ్యూల్ బ్యాంక్ ఖాతాలు కనుగొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 10,000 (ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా), కెనరా బ్యాంక్‌లో 7,000 (సిండికేట్ బ్యాంక్‌తో సహా), కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 6,000, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో 5,000 మ్యూల్ ఖాతాలు కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2023 నుంచి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో సుమారు ఒక లక్ష సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. గత ఏడాదిలో సుమారు రూ.17,000 కోట్ల నగదు మోసం జరిగిందని పేర్కొన్నారు.
మ్యూల్ ఖాతాల నిర్వహణ ఇలా..
సైబర్ నేరస్థులు బ్యాంకు ఖాతాదారులను నమ్మించి వారికి తెలియకుండా కేవైసీ పూర్తి చేస్తారు. మనీలాండరింగ్‌కు పాల్పడుతూ ఖాతాదారుల ప్రమేయం లేకుండా లావాదేవీలు పూర్తి చేస్తారు. లీగల్ కేసు అయితే ఖాతాదారులను అదుపులోకి తీసుకుంటారు. కాబట్టి బ్యాంకులోగానీ, బయటగానీ అపరిచితులు, బంధువులకు బ్యాంకు, వ్యక్తిగత వివరాలు తెలియజేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఓటీపీలు కూడా ఇతరులతో పంచుకోకూడదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment