- నవంబర్ 10 నుంచి వంట గ్యాస్ లబ్ధిదారులకు నగదు బదిలీ అమలు
- లబ్ధిదారుల ఖాతాలోకి రాయితీ జమ చేయాలని కేంద్రం నిర్ణయం
- యూపీఏ హయాంలో నగదు బదిలీని తప్పుపట్టిన బీజేపీ అధిష్టానం!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అప్పుడు వద్దే వద్దన్నారు.. ఉద్యమాలు చేశారు.. చివరకు యూపీఏ ప్రభుత్వం దిగవచ్చి పథకాన్ని రద్దు చేసింది.. ఇప్పుడు యూపీఏ స్థానంలో గద్దెనెక్కిన ఎన్‌డీఏ సర్కారు అదే ముద్దు అంటోంది. వచ్చే నెల 10 నుంచి గ్యాస్ లబ్ధిదారులకు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని శనివారం నిర్ణయించింది. తొలుత పూర్తి ధరకు లబ్ధిదారుడు గ్యాస్ సిలిండర్‌ను కొనుగోలు చేస్తే.. ఆ తర్వాత రాయితీని వారి ఖాతాల్లోకి జమ చేయాలని కేంద్రం నిర్ణయించడం గమనార్హం.
రాయితీ భారాన్ని తగ్గించుకోవడానికి యూపీఏ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2013 నుంచి వంట గ్యాస్ లబ్ధిదారులకు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇందుకు వంట గ్యాస్ సర్వీసు నెంబరు, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డులను అనుసంధానం(సీడింగ్) చేశారు. జిల్లాలో 7.20 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉంటే.. ఇప్పటిదాకా 6.79 లక్షల మంది లబ్ధిదారుల సీడింగ్‌ను పూర్తిచేశారు. అంటే.. నేటికీ 41 వేల మంది లబ్ధిదారుల సీడింగ్‌ను పూర్తిచేయాల్సి ఉంది.
ఆధార్ సీడింగ్‌లో తప్పులు దొర్లడం.. నిరుపేదలైన లబ్ధిదారులు పూర్తిస్థాయి ధరను పెట్టి గ్యాస్‌ను కొనుగోలు చేయలేకపోవడం.. అనుసంధానంలో తప్పుల వల్ల రాయితీ ఖాతాల్లోకి జమా కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. అప్పట్లో విపక్షంలో ఉన్న బీజేపీ గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయడాన్ని తప్పుపట్టింది. బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ కూడా నగదు బదిలీ పథకాన్ని తూర్పారబట్టింది. గ్యాస్ నగదు బదిలీ పథకాన్ని అమలుచేయడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేశారు.
ప్రజావ్యతిరేకతను ఆలస్యంగా పసిగట్టిన యూపీఏ ప్రభుత్వం ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని రద్దు చేసింది. దాంతో.. సాధారణ ధరకే లబ్ధిదారులు గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నారు. కానీ.. అప్పట్లో గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని వద్దే వద్దని ఉద్యమించిన ఎన్‌డీఏ ఇప్పుడు ఆ పథకమే ముద్దు అంటోంది. నవంబర్ 10 నుంచి గ్యాస్ లబ్ధిదారులకు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది.
రాయితీని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని స్పష్టీకరించింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ పూర్తి ధర 917.50 రూపాయలు. ఇందులో రాయితీ రూ.470. ఇప్పుడు నగదు బదిలీ పథకం అమల్లో లేకపోవడం వల్ల రూ.446.50 చెల్లిస్తే.. గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేసేవారు. నవంబర్ 10 నుంచి ఇది సాధ్యం కాదు.
గ్యాస్ కనెక్షన్ నెంబరు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబరును అనుసంధానం చేశారో లేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోవాలి. పూర్తి ధర అంటే రూ.917.50ను వెచ్చిస్తే గ్యాస్ సిలిండర్‌ను రీఫిల్లింగ్ చేస్తారు.. ఆ తర్వాత రాయితీని అంటే రూ.470ను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. సీడింగ్ సక్రమంగా జరగకపోతే రాయితీ గోవిందా.. గోవిందా..!!