న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలను రూ.2 లక్షలకు మించి కొనుగోలు చేస్తుంటే కేవైసీ వివరాలు ఇవ్వాలన్నది నిబంధన. అయితే, ఆభరణాల విక్రయదారులు (జ్యుయలర్స్) రూ.2 లక్షల్లోపు కొనుగోళ్లకూ కస్టమర్ల నుంచి కేవైసీ పత్రాలైన పాన్ లేదా ఆధార్ అడగడం మొదలు పెట్టేశారు. రానున్న బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల నగదు కొనుగోళ్లకు కేవైసీని తప్పనిసరి చేయవచ్చని వర్తకులు భావిస్తున్నారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి జ్యుయలరీ పరిశ్రమను తీసుకొచ్చినందున.. భవిష్యత్తులో ఏవైనా అనుమానాస్పద లావాదేవీని గుర్తించినట్టయితే తమపై కఠినచర్యలు తీసుకోవచ్చన్న భయం వర్తకుల్లో నెలకొని ఉంది. బంగారం మినహా ఇతర అన్ని రకాల పెట్టుబడి సాధనాలకూ కేవైసీ తప్పనిసరిగా అమల్లో ఉంది. బంగారానికి వస్తే రూ.2 లక్షలకు మించిన కొనుగోళ్లకే కేవైసీ ప్రస్తుతం అమల్లో ఉంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ మాదిరే బంగారాన్నీ పెట్టుబడి సాధనంగా గుర్తించాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉందని.. ఇందుకోసం సమగ్రమైన బంగారం విధానాన్ని తీసుకురానుందని జ్యుయలరీ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఏటా మన దేశం 800–850 టన్నుల బంగారాన్ని వినియోగిస్తోంది.
వివరాలను వెల్లడించాల్సిందే..
ఖరీదైన మెటల్స్, ఖరీదైన స్టోన్స్ డీలర్లను పీఎంఎల్‌ఏ కిందకు తీసుకురావడంతో.. బంగారం, వెండి, ప్లాటినమ్, వజ్రాలు, ఇతర రాళ్లను విక్రయించే జ్యుయలర్లు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు లావాదేవీల వివరాలను వెల్లడించాల్సి వస్తుందంటూ ‘ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్’ (ఐబీజేఏ) జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా చెప్పారు. పీఎంఎల్‌ఏ కిందకు బంగారాన్ని గత డిసెంబర్ 28 నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిందని.. దీంతో బంగారం ఆభరణాల వర్తకులు అనుమానిత లావాదేవీల వివరాలను, ఒక నెలలో రూ. 10 లక్షలకు మించిన నగదు కొనుగోళ్ల వివరాలను ప్రభుత్వ అధికారులకు నివేదించాల్సి ఉంటుందని మెహతా చెప్పారు.
‘‘కుటుంబ సభ్యుల కోసం రూ.2 లక్షల్లోపు కొనుగోలు చేసే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇప్పటివరకు అభిప్రాయం ఉంది. అయితే, ప్రభుత్వ ఏజెన్సీలు మరింత కఠినంగా వ్యవహరించడం ద్వారా.. అన్ని లావాదేవీల వివరాలను అనుసంధానించి జ్యుయలర్లపై చర్యలు తీసుకోవచ్చు’’ అని ఆభరణాల పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
అధిక విలువ కొనుగోళ్లకే కేవైసీ పరిమితం: ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: అన్ని రకాల బంగారం కొనుగోళ్లకు కేవైసీ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అధిక విలువ కలిగిన బంగారం, వెండి, జెమ్స్ కొనుగోళ్లకు చేసే నగదు చెల్లింపులకు కేవైసీ పత్రాలైన పాన్ లేదా ఆధార్ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీఎమ్‌ఎల్‌ఏ చట్టం కిందకు తమనూ చేర్చడంతో అన్ని రకాల నగదు కొనుగోళ్లకు కేవైసీ తప్పనిసరి చేయవచ్చని ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. డిసెంబర్ 28న వచ్చిన నోటిఫికేషన్‌పై కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం స్పందించింది. ‘‘నగదు రూపంలో ఆభరణాలు, బంగారం, వెండి, ఖరీదైన జెమ్స్, రాళ్ల విలువ రూ.2లక్షలు మించి కొనుగోళ్లు ఉంటే కేవైసీ ఇవ్వాలన్నది గత కొన్నేళ్ల నుంచి అమల్లో ఉన్నదే. పీఎమ్‌ఎల్ యాక్ట్, 2002 చట్టం కింద డిసెంబర్ 28 నాటి నోటిఫికేషన్.. వ్యక్తులు లేదా సంస్థలు బంగారం, వెండి, జ్యుయలరీ, ఖరీదైన రాళ్లను రూ. 10లక్షలు, అంతకుమించి కొనుగోలు చేస్తే కేవైసీ డాక్యుమెంట్లు అవసరం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్)లో భాగమే ఇది’’ అని తెలిపింది.
నగల కొనుగోళ్లపై ‘పాన్’ పిడుగు!
Published Sat, Jan 9 2021 5:18 AM | Last Updated on Sat, Jan 9 2021 7:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment