ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేసి డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారా..? బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసేపుడు అనుకోకుండా పాన్‌కార్డు మరిచిపోయారా..? టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం చేసేపుడు ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవడం గుర్తులేదా..? కంగారు పడకండి. మీ కోసమే ఈ కథనం.
నిత్యం ఏదో ఒక సందర్భంలో పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..వంటి గుర్తింపుకార్డులు అవసరమవుతూ ఉంటాయి. నిత్యం ఫిజికల్‌గా వీటిని వెంటతీసుకెళ్లడం కుదరకపోవచ్చు. కానీ ఎంత అత్యవసరాల్లో అయినా మొబైల్‌ను మాత్రం దాదాపు గుర్తుంచుకుని తీసుకెళ్తుంటాం. మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లో అన్ని గుర్తింపుకార్డులు డిజిటల్ రూపంలో ఉంటే ఎంత బాగుంటుందో కదా. అయితే, డిజీలాకర్ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అసలు ఈ లాకర్ ఏంటీ..? దీన్ని ఎలా వినియోగించాలో తెలుసుకుందాం.
డిజీలాకర్
ఇది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఇందులో సర్టిఫికెట్లు, కీలకపత్రాలను సురక్షితంగా దాచుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు సులువుగా వినియోగించుకోవచ్చు. పదోతరగతి సర్టిఫికెట్ నుంచి ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, రేషన్‌కార్డు.. ఇలా ప్రభుత్వం జారీ చేసిన అన్ని డాక్యుమెంట్‌లనూ డిజిటల్ రూపంలో దాచుకోవడానికి ఈ లాకర్ ఉపయోగపడుతుంది. జీవిత బీమా వంటి ముఖ్యమైన పత్రాలను ఇందులో దాచుకోవచ్చు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయి ట్రాఫిక్ పోలీసులకు చిక్కినా డిజీలాకర్‌లో ఉన్న పత్రాలు చూపించొచ్చు. ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చు.
వినియోగం ఇలా..
ప్లేస్టోర్ నుంచి ఫోన్‌లో డిజీలాకర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆరంకెల సెక్యూరిటీ పిన్‌ను వస్తుంది. దాన్ని సంబంధింత బ్లాక్‌లో ఎంటర్ చేయాలి. మీ ఆధార్‌కార్డ్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఆధార్ నంబర్ లేదా ఆరంకెల సెక్యూరిటీ పిన్ సాయంతో లాగిన్ అవగానే మీ ఆధార్ కార్డు, పాన్‌కార్డు వివరాలు అందులో కనిపిస్తాయి. యాప్‌లో సెర్చ్ సింబల్‌పై క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్ ప్రత్యక్షమవుతుంది. వాటిలో మీ ప్రాంతం, యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకొని హాల్‌టికెట్ నంబర్, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్ చేసి డాక్యుమెంట్లు పొందొచ్చు. వీటితో పాటు రేషన్‌కార్డు..వంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవసరమైనపుడు ఆ డాక్యుమెంట్లను వినియోగించుకోవచ్చు.
ఇదీ చదవండి: లోన్ కావాలా..? సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే..
ఇతర పత్రాలను ఎలా అప్‌లోడ్ చేయాలంటే..
కేవలం ప్రభుత్వం అందించే డాక్యుమెంట్లే కాకుండా ఇతర విలువైన పత్రాలను డిజిటల్ రూపంలో ఈ లాకర్‌లో భద్రపరచుకోవచ్చు. డిజీలాకర్ యాప్‌లో సైన్-ఇన్ అవ్వగానే కిందకు స్క్రోల్ చేస్తే ‘డిజీలాకర్ డ్రైవ్’ అని ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ‘+’ సింబల్‌పై ప్రెస్ చేయాలి. మీకు కావాల్సిన డాక్యుమెంట్లను మాన్యువల్‌గా అప్‌లోడ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ మాదిరిగా అక్కడే ప్రత్యేక ఫోల్డర్లు కూడా క్రియేట్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. డిజీలాకర్‌లో ప్రతీ యూజర్‌కు 1 జీబీ క్లౌడ్ డేటా లభిస్తుంది. 10 ఎంబీ వరకు సైజ్ ఉన్న ఒక్కో ఫైల్‌ను స్టోర్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సాయంతో ఎక్కడున్నా వీటిని యాక్సెస్ చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment