మియాపూర్ వాసికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు
భయంతో ఓ హోటల్ గదిలో స్వీయ నిర్బంధం
కొన్ని గంటల తర్వాత ధైర్యం చేసిన బాధితుడు
సిటీ ఠాణాకు ఫోన్, కానిస్టేబుల్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్ పార్శిల్స్, మనీ లాండరింగ్, బ్యాంకు ఖాతా దుర్వినియోగం అంటూ పోలీసుల పేరుతో ఫోన్లు చేస్తున్న సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్టు’ చేస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నిఘా గంటల తరబడి నిర్భంధించి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి వారి బారినపడి రూ.లక్షలు, రూ.కోట్లు నష్టపోయిన కేసులు ఇటీవలి కాలంలో అనేకం నమోదయ్యాయి. అయితే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన కానిస్టేబుల్ గణేష్ చొరవతో సైబరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ ఫ్రాడ్ బారినపడకుండా బయటపడ్డారు. పరిధులు పట్టించుకోకుండా వేళకాని వేళలో వచ్చిన ఫోన్ కాల్‌కూ పక్కాగా స్పందించిన గణేష్‌ను ఉన్నతాధికారులు ఆదివారం అభినందించారు.
మియాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగికి శుక్రవారం వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్‌లు వచ్చాయి. ఈయన ఆధార్ నెంబర్ వినియోగించి ముంబైలో కొందరు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై అక్కడ కేసు నమోదైందని వాటిలో ఉంది. ఆ సందేశాలను బాధితుడు పట్టించుకోలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్చువల్ నెంబర్ల ద్వారా ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ముంబై పోలీసుల మాదిరిగా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి యూనిఫాంలో కనిపించారు. కేసు, అరెస్టు అంటూ తీవ్రంగా భయపెట్టి ఇంట్లో ఉంటే స్థానిక పోలీసులూ వచి్చన అరెస్టు చేస్తారని భయపెట్టారు. తాను ఎప్పుడూ ముంబై రాలేదని, ఆ ఆరి్థక లావాదేవీలతో తనకు సంబంధం లేదని చెప్పినా సైబర్ నేరగాళ్లు పట్టించుకోలేదు.
శనివారం తెల్లవారుజాము నుంచి రకరకాలుగా భయపెట్టిన వారు సదరు ఐటీ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.13 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. సోమవారం వరకు అతడు ఎక్కడికీ వెళ్లకుండా, ఎవరితో మాట్లాడకుండా చేసి ఆపై ఆరీ్టజీఎస్ ద్వారా ఆ మొత్తం కాజేయాలని పథకం వేశారు. దీంతో ఐటీ ఉద్యోగిని డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు చెప్పిన సైబర్ నేరగాళ్లు ఇంటి నుంచి బయటకు రప్పించారు. కుటుంబీకులతో సహా ఎవరినీ కలవద్దంటూ షరతు విధించి అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో బస చేయించారు. ఇలా ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఆడియో, వీడియో కాల్స్ కట్ చేయని సైబర్ నేరగాళ్లు బాధితుడిని హోటల్ గదిలోనే ఉంచారు.
ఆ సమయంలో కాల్ కట్ అవడంతో బాధితుడికి కాస్తా అవకాశం చిక్కింది. దీంతో ధైర్యం చేసిన అతడు ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణా ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సదరు నెంబర్‌కు కాల్ చేయగా... ఆ సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గణేష్ అందుకున్నారు. సాధారణంగా పోలీసులు తమకు ఫోన్ చేసిన బాధితులు బయటి ప్రాంతాలకు చెందిన వారని చెప్పగానే... అక్కడి అధికారులను సంప్రదించాలని చెబుతుంటారు.
అయితే ఈ బాధితుడు మియాపూర్ వాసిని అని చెప్పినా ఆ సమయంలోనూ పక్కాగా స్పందించిన గణేష్ విషయం మొత్తం తెలుసుకున్నారు. అది సైబర్ మోసమంటూ బాధితుడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మియాపూర్‌లో వారి ఇంటి పక్కన ఉండే స్నేహితుడి నెంబర్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పిన గణే‹Ù... బాధితుడి వద్దకు వచ్చి తీసుకువెళ్లేలా చొరవ చూపారు. ఈ అంశంలో కానిస్టేబుల్ గణేష్ స్పందనకు ఉన్నతాధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment