రతన్ టాటాపై కేసు నమోదు
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణియన్ స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. టాటాగ్రూపు అధినేత రతన్ టాటాపై మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు ఫైల్ చేశారు. 2జి స్పెక్ట్రమ్ లైసెన్స్ పొందటానికి మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ శుక్రవారం స్పెషల్ సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేశారు. 2 జి స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణం కేసులో మాజీ టెలికాం మంత్రి ఎ. రాజా, కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా తదితరులను విచారించాలని స్వామి కోరారు.
టాటా సన్స్ మధ్యంతర ఛైర్మన్ రతన్ టాటా, యూనిటెక్ అధికారులపై స్వామి ఆరోపణలు గుప్పించారు. అలాగే ఈ కేసులో గుర్తు తెలియని సీబీఐ అధికారులు టాటాలను రక్షిస్తున్నారని ఆరోపించారు. అవినీతి నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంలోని 409 , 420 (మోసం), 463 (ఫోర్జరీ), 120-బి (నేరపూరిత కుట్ర) సెక్షన్లకింద తన ఫిర్యాదును నమోదు చేశారు. దీంతో సీబీఐ ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ స్వామి ఫిర్యాదును స్వీకరించారు. తదుపరి విచారణ నిమిత్తం ఈకేసును జనవరి 11 కు వాయిదా వేశారు.