![బీవోబీ స్కాంలో ఆరుగురు అరెస్టు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41444740943_625x300.jpg.webp?itok=aNS0QcI3)
బీవోబీ స్కాంలో ఆరుగురు అరెస్టు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో వెలుగుచూసిన రూ. ఆరు వేల కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణంలో ఆరుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. వీరిలో నలుగురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టుచేయగా, మరో ఇద్దరిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో ఢిల్లీలోని అశోక్ విహార్ బ్రాంచ్కు చెందిన బ్రాంచ్ హెడ్ సురేశ్కుమార్ గార్గ్, ఫారెన్ ఎక్స్చేంజ్ హెడ్ జైనిస్ దూబే ఉన్నారు.
బ్యాంకులోని 59 ఖాతాల ద్వారా హాంకాంగ్, దుబాయ్లోని బూటకపు ఎగుమతి-దిగుమతి కంపెనీలకు నిధులు బదిలీ చేయడం ద్వారా బ్యాంకు అధికారులే ఈ స్కాంకు పాల్పడినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. గతెకొన్ని రోజులుగా ఈ స్కాంను ఛేదించడానికి సీబీఐ-ఈడీ సంయుక్తంగా దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. బ్యాంకు అధికారులే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఈ మనీలాండరింగ్ కుంభకోణాన్ని నడిపించినట్టు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.